calender_icon.png 14 May, 2025 | 8:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాతబస్తీలో ‘ప్రపంచ అందాలు’

14-05-2025 01:32:12 AM

  1. చార్మినార్ వద్ద మిస్ వరల్డ్ పోటీదారుల సందడి
  2. హెరిటేజ్ వాక్, ఫొటోషూట్‌తో మురిసిన భామలు
  3. లాడ్‌బజార్ గాజుల దుకాణాల్లో షాపింగ్
  4. గాజుల తయారీని స్వయంగా పరిశీలించి కళాకారులకు మెచ్చుకోలు
  5. చౌమహల్లా ప్యాలెస్‌లో ప్రభుత్వం తరఫున విందు
  6. హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు, సినీ, రాజకీయ ప్రముఖులు

హైదరాబాద్, మే 13 (విజయక్రాంతి):  మిస్‌వరల్డ్ పోటీదారులకు తెలంగాణ ప్రభు త్వం మంగళవారం చౌమహల్లా ప్యాలెస్‌లో విందు ఏర్పాటు చేసింది. ప్రపంచ సుందరీమణులు చార్మినార్, లాడ్‌బజార్‌లను సందర్శిం చారు. అనంతరం చౌమహల్లా ప్యాలెస్‌లో జరిగిన విందు కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు, మంత్రులు, ప్రముఖనటుడు నాగార్జున, ఇతర సినీతారలు హాజరయ్యారు.

అంతకుముందు 109 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ పోటీదారులు ప్రపంచ ప్రఖ్యాత చార్మినార్‌ను సందర్శించారు. చార్మినార్ సందర్శన వారికి అద్భుతమైన మధురానుభూతులను మిగిల్చింది. ఐదు శతాబ్దాలుగా హైదరాబాద్ మధ్యన ఠీవిగా నిలబడి ఉన్న సొగసైన కట్టడాన్ని చూసి సుందరాంగులు మంత్రముగ్ధుల య్యారు. సందర్శన కోసం చార్మినార్ వద్దకు పర్యాటక బస్సులతో చేరుకున్న మిస్ వరల్డ్ కంటెస్టెంట్‌లకు అధికారులు రెడ్‌కార్పెట్ స్వాగతం పలికారు.

స్థానిక కళాకారులు వారికి సంప్రదాయక అరబ్బీ మార్ఫా వాయిద్యాలతో స్వాగతం పలికారు. మార్ఫా శబ్దాలతో మమేకం చేస్తున్నట్లుగా కొందరు కంటెస్టెంట్స్ ప్రత్యేక స్టెప్పులతో నృత్యం చేసి అలరించారు. ఈ అందాల రాయబారులతో చార్మినార్ పరిసరాలు ఒక సరికొత్త శోభ పొందాయి. ప్రత్యే కంగా చార్మినార్ వద్ద ఫొటోషూట్‌కు హాజరైన సుందరాంగులు, ఈ చారిత్రాత్మిక వేదిక నుం చి ప్రజలకు అభివాదం చేస్తూ, తమ ఆనందం, సంతోషాన్ని వ్యక్తం చేశారు.

చార్మినార్ అందాలను ఈ అందగత్తెలు తమ సెల్‌ఫోన్లలో ఫొటోలను తీసుకున్నారు. అనంతరం ప్రపం చ అందగత్తెలు చార్మినార్ ముందు నిర్వహించిన హెరిటేజ్ వాక్ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి తెలిపారు. సందర్శనలో భాగం గా, చార్మినార్ సమీపంలోని ప్రసిద్ధ చుడీబజార్ (లాడ్‌బజార్)లో కంటెస్టెంట్స్ గాజులు, ముత్యాల హారాలు, ఇతర అలంకరణ వస్తువుల షాపింగ్ చేసి, స్థానిక హస్తకళల పట్ల ఆసక్తి ప్రదర్శించారు.

కొందరు కంటెస్టెంట్స్ గాజుల తయారీ ప్రక్రియను స్వయంగా పరిశీలించి, నిపుణులైన కారిగర్లు (కళాకారులు), శిల్పులకు ప్రశంసలు తెలిపారు. వారి శ్రమ, నైపుణ్యం ప్రపంచ వేదికపై ప్రదర్శించతగినదని భావించారు.  ఈ కార్యక్రమం ద్వారా, హైదరాబాద్ సాంస్కృతిక వారసత్వం, సౌందర్యం ప్రపంచానికి తెలియజేసినట్లయ్యింది. మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ సందర్శన కేవలం పోటీలలో భాగంగానే కాకుండా, ప్రపంచ శాంతి, సాంస్కృతిక సామరస్యానికి సాక్ష్యంగా నిలిచింది. 

లాడ్‌బజార్ వ్యాపారుల ఉదారత..

మిస్ వరల్డ్ పోటీదారులు కొనుగోలు చేసిన వస్తువులను ఉచితంగానే లాడ్‌బజార్ వ్యాపారులు అందజేశారు. వారి దగ్గర డబ్బులు తీసుకునేందుకు వ్యాపారుల నిరాకరించారు. హైదరాబాద్ విశిష్టతను చార్మినార్, లాడ్‌బజార్ ప్రత్యేకతలను ప్రపంచవ్యాప్తంగా వారివారి దేశాల్లో చాటాలని మిస్ వరల్డ్ కంటెస్టెంట్లను వారు కోరారు.

మిస్ వరల్డ్ ప్రతినిధులకు తమ షాపుల్లోకి గులాబీ పూలు ఇచ్చి వ్యాపారులు ఆహ్వానించారు. హిందుస్తానీ షహనాయ్ వాయిద్యాలతో మిస్ వరల్డ్ పోటీదారులకు చౌమహల్లాలోకి పాతబస్తీ సంస్కృతి, సాంప్రదాయాలు తెలిపే న్యత్యరీతులతో మహిళలు స్వాగతం పలికారు. ప్రపంచ సుందరీమణులకు హైదరాబాద్‌తో పాటు చార్మినార్ చౌమహల్లా ప్యాలెస్ ఇతర చారిత్రాత్మక నిర్మాణాలు, కట్టడాలపై అధికారులు వీడియో ప్రజేంటేషన్ ఇచ్చారు.  

హైదరాబాద్ ఆతిథ్యం మరిచిపోం..

చౌమహల్లా ప్యాలెస్‌లో నిజాం వంశస్థుల రాజసింహాసనం, వారు వాడిన వస్తువులు, సైనిక సామగ్రి, వంటసామగ్రిని ఆసక్తిగా మిస్ వరల్డ్ పోటీదారులు తిలకించారు. చౌమహల్లా ప్యాలెస్ 300 సంవత్సరాల చరిత్రను, విశిష్టతను వారు తెలుసుకున్నారు. ప్యాలెస్ అద్భుతంగా ఉందని, హైదరాబాద్ ఆతిథ్యం మమ్మల్ని మురిపిస్తోందని ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందని మిస్ వరల్డ్ పోటీదారులు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ పర్యటన జీవితాంతం గుర్తుంటుందని తెలిపారు. ‘తెలంగాణ జరూర్ ఆనా’ నినాదం తమ దేశాల్లో వినిపిస్తామని చెప్పారు. విందుకు హాజరైన నటుడు నాగార్జున మాట్లాడుతూ.. అందంతో పాటు ప్రతిభతో మిస్ వరల్డ్ పోటీ ఆసక్తికరంగా ఉంటుందని, ఈ ఈవెంట్ తో హైదరాబాద్ ప్రపంచ పటంలో నిలిచిపోతుందని అన్నారు.

హైదరాబాద్‌లో హిందూ, ముస్లిం సామరస్యత, సహాజీవన విధానం చాలా బాగా నచ్చిందని మిస్ నమీబియా ప్రతినిధి అన్నారు. కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొన్నారు.