యాసంగి ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళిక సిద్ధం చేయాలి
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్,మార్చి25(విజయక్రాంతి): యాసంగి ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కొనుగోలు కమిటీ సభ్యులను కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం జిల్లా కొనుగోళ్ల కమిటీ సభ్యులు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ ధాన్యం పూర్తిగా పరిపక్వతకు వచ్చిన తర్వాతనే హార్వెస్ట్ చేసేలా రైతులకు, హార్వెస్టింగ్ మిషన్ ఆపరేటర్లకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ధాన్యం కోతలకు సంబంధించి రెవెన్యూ గ్రామాల వారీగా నిర్దిష్ట ప్రణాళిక ఏర్పాటు చేయాలని అన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో తూకపు యంత్రాలు, తేమను కొలిచే యంత్రాలు, గన్ని సంచులు, తార్పాలీన్ కవర్లు వంటివి సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇప్పుడు ఉన్న ప్యాడి క్లీనర్ లతో పాటు మరో 15 ప్యాడి క్లీనర్ లను కొనుగోలు చేయాలని సూచించారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. ధాన్యం కొనుగోలు తర్వాత వెన్ వెంటనే వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు.
రైతుకు సకాలంలో సొమ్ము అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సన్న, దొడ్డు రకాల ధాన్యాలు వేరువేరు ప్రదేశాల్లో ఉండేలా చూడాలని సూచించారు. ఎండాకాలం దృశ్య రైతులకు నీడ, తాగునీటి సౌకర్యం ఉండేలా చూడాలని తెలిపారు.
సిబ్బంది కొనుగోలు రిజిస్టర్ ను అందుబాటులో ఉంచుకోవాలని, పకడ్బందీగా వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. తేమ యంత్రాన్ని నీడలోనే ఉండేలా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, డిఆర్‌ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్ ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.






