calender_icon.png 15 September, 2025 | 11:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాటి పాలువంచి.. నేటి పాల్వంచ

15-12-2024 03:15:09 AM

కాకతీయ, నైజాంలు ఏలిన ప్రాంతంగా ప్రసిద్ధి

వారి కాలంలోనే ఆలయాల నిర్మాణం 

తాగునీటి కోసం బుంగబావి, మంగబావుల తవ్వకం

క్రీ.శ 1324 తర్వాత సంస్థానంగా మార్పు

శిథిలావస్థకు చేరుకున్న ఆనాటి ఆలయాలు

కొన్ని పునర్నిర్మితమవుతుండగా మరికొన్ని కనుమరుగు

భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 14 (విజయక్రాంతి): పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం.. వెరసి రాజులు, నైజాం నవాబుల ఆనవాళ్లు క్రమేణా కనుమరుగవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచను వందల ఏళ్ల క్రితం కాకతీయ రాజులు పాలించారు. క్రీ.శ 1324 తర్వాత కాకతీయుల పతనానంతరం పాల్వంచ సంస్థానంగా ఏర్పడింది. పాల్వంచను రాజధానిగా మార్చుకొని మొదటి సంస్థానాధీశుడైన అప్పన్న అశ్వరాయవు 800 చదరపు  కిలోమీటర్ల విస్తీర్ణంలో పరిపాలన చేశారు. వారిది పద్మనాయక వంశం.

అశ్వారావుపేట, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు పాల్వంచ రాజధానిగా ఉండేది. ఈ సంస్థానానికి చివరి రాజు విజయ అప్పారావు.  వీరి కాలంలో పాల్వంచలో అనేక ఆలయాలను నిర్మించి చెరువులు, బావులను తవ్వించారు. పాత పాల్వంచలో వారికి పెద్ద గడి (మొదట్లో గడియకట్ట) ఉండేది. దాని పేరును క్రమేపీ శ్రీనివాసకాలనీగా మార్పు చేశారు. ఐదేళ్ల కిత్రం వరకు పాత పాల్వంచలో ఉన్న రాజుగారి బంగ్లా శిథిలావస్థకు చేరడంతో అధికారులు కూల్చివేశారు.

ఆ తర్వాత గడియకట్ట కాస్తా నివాస ప్రాంతంగా మారింది. 1948లో హైదరాబాద్ రాజ్యం యూనియన్ ఆఫ్ ఇండియాలో విలీనమయ్యాక సంస్థానం కనుమరుగైంది. ఆనాడే పాతపాల్వంచలో తాగునీటి కోసం బుంగబావి, మంగబావులను తవ్వించారు. చింతల చెరువుపై శివాల యం, గుడిపాడు, శ్రీనివాసగుట్టపై వేంకటేశ్వరస్వామి ఆలయాలను నిర్మించారు.

ప్రస్తుతం శ్రీనివాసగుట్టపై ఉన్న వేంకటేశ్వర స్వామి, చింతలచెరువుపై ఆత్మలింగేశ్వరస్వామి ఆలయాలను పునర్నిర్మించగా.. గుడిపాడు వేంకటేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో మరికొన్ని ఆలయాలపై దృష్టి పెట్టకపోవడంతో శిథిలావస్థకు చేరుకొని కాకతీయుల కాలం నాటి ఆనవాళ్లు కనుమరుగవుతున్నాయి. 

ఆ పేరెలా వచ్చిందంటే..

ఆనాటి   పాలువంచి 15,796 ఎకరాల విస్తీర్ణం లో ఉండేది. అయితే సర్వే నెంబర్ 1 నుంచి 136 వరకు నైజాం నవాబులు పాలించేవారు. వీరి పరిధిలోని భూములన్నింటికీ పట్టాలుండేవి. బూర్గంపాడు తహసీల్దార్‌గా కంచర్ల గోపన్న విధులు నిర్వర్తిస్తూ వచ్చిన కప్పాన్ని భద్రాచలంలో రామాలయం నిర్మాణానికి ఇచ్చారని చెప్తుంటారు. పాల్వంచ ప్రాంతంలోని దివాన్ తాలూకా, సంస్థాన తాలూకా పరిధిలో 116 గ్రామాలు, రెండు పట్టణాలు ఉండేవి.

పాల్వంచ గ్రామం, పాల్వంచ సంస్థాన తాలూకా పరిధిలోనే ఉండేది. 1962లో పాల్వంచ తహసీల్దార్ కేంద్రంగా ఏర్పడగా గోల్కొండ కేంద్రంగా తానీషా పాలించేవారు. స్థానికుల కథనం ప్రకారం ఆ రోజుల్లో పాల్వంచ సంస్థానంలో అశ్వక దళాలు అధికంగా ఉండేవి. అందులో ఒక గుర్రం ఎవరినీ దగ్గరకు రానిచ్చేది కాదట. దీంతో సేనాధిపతి రాజుకు ఓ సలహా ఇచ్చారట.

ఆ గుర్రంపై స్వారీ చేస్తూ ఎంతదూరం వెళ్లి ఆగితే అంత ప్రాంతాన్ని వారికి కానుకగా ఇస్తానని ప్రకటించారు. దీంతో అప్పన్న అశ్వరాయ రాజు  గుర్రంపై స్వారీ చేస్తూ పాతపాల్వంచలోని  ప్రస్తుత వీకే నాగేశ్వరరావు పెట్రోల్ బంక్ వద్ద ఆగారు. గుర్రం అలసిపోయి ఉండటాన్ని గమనించిన అశ్వరాయ రాజు  అక్కడ దిగాడు. ఇది గమనించిన ఓ వ్యక్తి దగ్గరలోని చెట్టు కింద నివశిస్తున్న  గొల్లలను పిలిచి అశ్వరాయ రాజుకు పాలు పోయాలని చెప్పాడు.

గొల్లలు వెంటనే పాలు పితికి పోయగా.. అందుకు గుర్తుగా అక్కడి వృక్షంపై పాలువంచి అని అప్పన్న అశ్వారాయ రాశారట. అప్పటి నుంచి  ఆ ప్రాంతాన్ని పాలువంచిగా పిలిచేవారని, కాలక్రమేనా అదే పాల్వంచగా మారిందని స్థానికులు చెబుతుంటారు. 

పాల్వంచ సంస్థానం

నైజాం రాష్ట్రంలోని 14 సంస్థానాల్లో ఐదింటిలోనే పాలనాధికారులు ఉండేవారు. వాటిలో పాల్వంచ ఒకటి. ఒకప్పుడు సుభా వరంగల్ పరిధిలో ఉన్న ఈ సంస్థానం 1950లో ఖమ్మం జిల్లా ఆవిర్భావం తర్వాత అందులో కలిసిపోయింది. 800 చదరపు మైళ్ల వైశాల్యం ఉన్న ఈ సంస్థానంలో 1901 లెక్కల ప్రకారం 38,742 మంది జనాభా ఉండగా.. రెవెన్యూ ఆదాయం 70,090 (నిజాం సిక్కాలు)గా ఉండేది.
కప్పం కింద నిజాంకు 45,875 సిక్కాలు.. దేశముఖ్‌కు 4,716 సిక్కాలు చెల్లించే వారు. దట్టమైన అడవులతో ఉన్న ఈ ప్రాంతానికి  వాయువ్యంగా గోదావరి నది మొదలై, ఆగ్నేయ దిశగా పారుతూ ఈ ప్రాంతాన్ని రెండుగా చీల్చింది. నది కుడివైపు ప్రాంతం నిజాం రాష్ట్రంలో, ఎడమవైపు ప్రాంతం మద్రాస్ ప్రెసిడెన్సీల్ బిట్రీష్ ఆధీనంలో ఉండేవి.
హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంత ప్రజలు ఆర్డీవోను కలిసేందుకు ఇబ్బందులు తలెత్తు తుండటంతో గోదావరిపై వంతెన నిర్మించి ఖమ్మం జిల్లాలో కలిపారు. ఈ క్రమంలోనే పాల్వంచ సంస్థానాన్ని జాగీర్ రద్దు చట్టం  ద్వారా అప్పటి మిలట్రీ గవర్నర్  జేఎన్ చౌదరి 1949లో రద్దు చేశారు. దీన్ని ఏకేశ్వరరావు అశ్వరాయ నుంచి 27 స్వాధీనం చేసుకొని రెవెన్యూ శాఖలో విలీనం చేశారు. మే 1950లో హైదరాబాద్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం వరంగల్ జిల్లాలో ఉన్న ఇల్లెందు, పాల్వంచ, బూర్గంపాడు తాలుకాలు కొత్తగూడెం రెవెన్యూ డివిజన్ పరిధిలోకి చేర్చారు.