15-09-2025 11:03:04 PM
విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడవద్దు
బహుజన పిల్లల పైన సీఎం రేవంత్ రెడ్డికి ఎందుకు అంత కపట ప్రేమ.
విద్యార్థులతో కలిసి ధర్నాలో పాల్గొన్న సుందర్ రాజ్ యాదవ్
హనుమకొండ,(విజయక్రాంతి): ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలపై నిన్న ప్రభుత్వం ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలతో జరిపిన చర్చలు విఫలం కావడంతో వివిధవిద్యార్థి సంఘాల నేతలు హనుమకొండ అదాలత్ జంక్షన్ లో ధర్నా నిర్వహించారు.విద్యార్థుల ఆందోళనకు సంఘీభావంగా పిజి, డిగ్రీ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సుందర్ రాజ్ యాదవ్ పాల్గొన్నారు. ముందుగా హంటర్ రోడ్డులోని మాస్టర్ జీ కళాశాల నుంచి అదాలత్ సెంటర్ వరకు విద్యార్థులతో కలిసి సుందర్ రాజ్ యాదవ్ ర్యాలీలో పాల్గొన్నారు. విద్యార్థులతో కలసి సుందర్ రాజ్ యాదవ్ రోడ్డుపైన బైటాయించి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు.
ఈ ధర్నాలు ఉద్దేశించి కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెండింగ్ లో ఉన్నటువంటి రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది వేల కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే రూ. 1200 కోట్ల రూపాయలు విడుదల చేయాలని, ఉమ్మడి రాష్ట్రములో ఫీజు రీఎంబర్స్‌మెంట్ తీసుకొచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వంమే అధికారంలోకి వచ్చిన తరువాత ఫీజు రియంబర్స్మెంట్ గురించి మర్చిపోయిందని అని గుర్తు చేశారు. బకాయిలు సకాలంలో చెల్లించకపోవడంతో కళాశాలలు మూతపడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసిందని ఎలా చెబుతారని, అలా అయితే ప్రభుత్వము సంక్షేమ పథకాలకు పైసలు ఎక్కడ నుంచి ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి నిజంగా బహుజనులపై ప్రేమ ఉంటే ముందుగా పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించి న్యాయం చేయాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి రీఎంబర్స్మెంట్ చెల్లించకపోతే రాబోయే రోజులలో విద్యార్థులతో కలిసి ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న కుడా కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ ను పోలీసులు అరెస్టు చేసి సుబేదారి పోలీస్ స్టేషన్ తరలించారు.