calender_icon.png 15 September, 2025 | 9:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక పోరుకు బీఆర్‌ఎస్ కసరత్తు

15-12-2024 02:57:42 AM

ఆర్థికంగా ఉన్న నేతలను దింపేందుకు ప్రయత్నాలు

మెజార్టీ సీట్లు గెలిచేలా వ్యూహరచన 

కాంగ్రెస్ హమీలను ఎండగట్టేందుకు శిక్షణ

ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు ఎత్తులు

డిసెంబర్ చివరిలో మండలస్థాయి సమావేశాలు

హైదరాబాద్, డిసెంబర్ 14 (విజయక్రాంతి): రాష్ట్రంలో  జనవరిలో స్థానిక సం స్థలకు ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జోరుగా సాగుతున్నది. ఇప్పటికే వివిధ పార్టీ ల నేతలు అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డారు. ఆర్థికంగా ఉన్న నేతలతో నియోజకవర్గాల నేతలు మంతనాలు జరుపుతూ ఈ సారి సర్పంచ్‌గా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచనప్రాయంగా ఆదేశించినట్టు తెలుస్తోంది.

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో  ఓటమి చవిచూసిన బీఆర్‌ఎస్ స్థానిక పోరులో సత్తా చాటేందుకు కసరత్తు చేస్తోంది. ఈసారి తమ బలం నిరూపించుకోకుంటే భవిష్యత్తులో పార్టీ మనుగడ కష్టమని భావించిన ఆపార్టీ సీనియర్లు ఎన్నికలకు ముందుస్తు ఏర్పాట్లకు సిద్ధమయ్యారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలు ఎన్ని,  అధికారం చేపట్టాక ఎన్ని అమలు చేశారు? వంటి అంశాలను వివరించేందుకు మండల, గ్రామస్థాయి కార్యకర్తలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపుతూ ప్రచారం చేపట్టనున్నట్లు వారు చెప్తున్నారు. బీఆర్‌ఎస్ బలం పుంజుకునేందుకు, భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో శ్రేణులు చురుకుగా పనిచేసేందుకు పంచాయతీ ఎన్నికల గెలుపు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా 12,769 గ్రామపంచాయతీలు ఉండగా.. వాటికి కేసీఆర్ హయాంలో రెండు పర్యాయాలు ఒకే రిజర్వేషన్ విధానం తీసుకొచ్చింది. 2019లో అమలు కాగా 2025లోనూ అదే రిజర్వేషన్ వర్తించాలని పేర్కొంది. బీఆర్‌ఎస్ చేసిన విధానాలు ఎందుకు అమలు చేయాలని స్థానిక కాంగ్రెస్ నేతలు మంత్రులపై ఒత్తిడి చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కులగణన చేపట్టి జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు మారవచ్చని భావిస్తున్నది. 

ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో బీఆర్‌ఎస్ ఆశావహులు 

గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని బీఆర్‌ఎస్ ఆశావహులు ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో పడ్డారు. వారి పాలనలో సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారితో టచ్‌లో ఉంటూ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, పెన్షన్‌లు, రైతు భరోసా, పేదలకు ఇళ్లు ఇస్తామన్న హామీ నేరవేర్చలేదని ప్రచారం చేస్తున్నారు. తనను సర్పంచ్‌గా గెలిపిస్తే మరిన్ని పథకాలు అందేలా చూస్తామని హామీలు ఇస్తున్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడచినా పథకాలను ప్రజలకు పూర్తిస్థాయిలో అందించలేకపోయారు. ఈక్రమంలో కాంగ్రెస్ నేత లు స్థానిక పోరులో గులాబీ నేతలను ఢీకొట్టేందుకు వెనకడుగు వేస్తున్నారు. రేవంత్ పాలనలో కాంట్రాక్టు పనులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కువగా లేకపోవడంతో ఆర్థిక వనరులు సమకూర్చుకోలేకపోయారు. బీఆర్‌ఎస్ నేతలు పదేళ్ల పాటు సంపాదించుకుని ఎన్నికలు జరిగితే కాలు దువ్వేందుకు సిద్ధమవుతున్నారు. 

ఈ నెల చివర్లో మండలస్థాయి సమావేశాలు 

ఈనెల చివరి నుంచి మండలస్థాయిలో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి గ్రా మ బాధ్యులను నియమించనున్నారు. వారు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యుహాల ను వివరించనున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని పార్టీ సీనియర్లు ఆదేశించినట్టు తెలిసింది.

మెజార్టీ సీట్లు సాధించేలా శ్రమించాలని, ఈసారి ఓడిపోతే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు సీటు ఇచ్చే విషయంలో ఆలోచించక తప్పదని హెచ్చరించినట్లు తెలంగాణ భవన్‌లో టాక్ నడుస్తోంది. పార్టీ కార్యాలయం చుట్టూ తిరగకుండా స్థానిక ఎన్నికలపై ఫోకస్ పెట్టాలని సూచించినట్లు ద్వితీయశ్రేణి నాయకులు అంతర్గత సంభాషణలో వెల్లడించారు. 

గత రిజర్వేషన్లు రద్దు చేయాలి

గత ప్రభుత్వం నిర్ణయించిన సర్పంచుల రిజర్వేషన్లు రద్దు  చేసి కొత్త రిజర్వేషన్లు ఖరారు చేయాలని మంత్రులను గ్రామస్థాయి నాయకులు కోరుతున్నారు. గత పాలకుల విధానం అమలు చేస్తే తాము పోటీ చేయడం కష్టమని పేర్కొన్నట్టు తెలుస్తోంది. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పడు వారికి అనుకూలమైన విధానం చేసుకున్నారని, అది తమకు అనుకూలించదని, రిజర్వేషన్లు పెంచి నోటిఫికేషన్ వేయాలని సూచించినట్టు సమాచారం.