యోగాను జీవనశైలిలో భాగం చేసుకోవాలి
ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
శేరిలింగంపల్లి, జూన్ 21 (విజయక్రాంతి): అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా ఆదివారం రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలి స్టేడియంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆరోగ్య,వైద్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన సాంస్కృతిక వారసత్వమని అన్నారు.ఇది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాకుండా, మనస్సు, శరీరం, ఆత్మల మధ్య సమతుల్యతను సాధించే సమగ్ర జీవన విధానమని వివరించారు. ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళనలు, జీవనశైలి సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం పొందాలంటే యోగా అత్యుత్తమ మార్గమని తెలిపారు.
ప్రతిరోజూ కొద్ది సేపు యోగా సాధన చేయడం ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెంపొందించుకుని ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవచ్చని సూచించారు. ఐక్యరాజ్యసమితి జూన్ 21ను అంత ర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడంతో యోగా విశ్వవ్యాప్త గుర్తింపు పొందిం దని, ప్రపంచ దేశాలు భారతీయ యోగా సంప్రదాయాన్ని ఆదరిస్తున్నందుకు ప్రతి భా రతీయుడికి గర్వకారణమని మంత్రి వ్యాఖ్యానించారు.‘ఆరోగ్య తెలంగాణ ఆరోగ్య భారత్‘ నిర్మాణంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్న మంత్రి, యువత, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు సహా ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.
ప్రతి ఇంటిలో యోగా సంస్కృతి వృద్ధి చేస్తే ఆరోగ్య సమస్యలను గణనీయంగా తగ్గించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య, వైద్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి డా. క్రిస్టినా జెడ్. చోంగ్థు, ఐఏఎస్, జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్మయి, రాజేంద్రనగర్ ఆర్డీవో శ్రీధర్, శేరిలింగంపల్లి తహసీల్దార్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. స్వర్ణకుమారి, వివిధ శాఖల అధికారులు, యోగా గురువులు, విద్యార్థులు, యువత పాల్గొన్నారు.
యోగతోనే ఖైదీలకు సంపూర్ణ ఆరోగ్యం ః తెలంగాణ జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా
కుషాయిగూడ, జూన్ 21 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జైళ్లలో అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026ను ఘనంగా నిర్వహించినట్లు తెలంగాణ జైళ్ల మరియు దిద్దుబాటు సేవల శాఖ వెల్లడించింది. డైరెక్టర్ జనరల్ డా. సౌమ్య మిశ్రా ఐపీఎస్ నాయకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఖైదీల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుదలకు ప్రత్యేక యోగా శిక్షణలు అందించారు. జూన్ 10 నుంచి రాష్ట్రవ్యాప్తంగా జైళ్లలో యోగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించగా, పతంజలి యోగపీఠ్, బ్రహ్మకుమారీస్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ తదితర సంస్థలు సహకరించాయి. చర్లపల్లి కేంద్ర కారాగారంలో జరిగిన ప్రధాన కార్యక్రమంలో డా. సౌమ్య మిశ్రా ఖైదీలతో కలిసి సామూహిక యోగా సాధనలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక దృఢత్వం, భావోద్వేగ స్థిరత్వం, స్వీయ క్రమశిక్షణను పెంపొందిస్తుందని పేర్కొన్నారు. క్రమం తప్పకుండా యోగా చేయడం ద్వారా సానుకూల ఆలోచన, అంతరంగ శాంతి, ఆత్మనిగ్రహం పెరుగుతాయని తెలిపారు. ఖైదీల సంస్కరణ, పునరావాసం కోసం విద్య, నైపుణ్యాభివృద్ధి, కౌన్సెలింగ్, క్రీడలు, సాంస్కృతిక, ఆరోగ్య కార్యక్రమాలను జైళ్ల శాఖ నిరంతరం అమలు చేస్తోందని ఆమె వెల్లడించారు. యోగా కార్యక్రమాల్లో ఖైదీలు ఉత్సాహంగా పాల్గొనడాన్ని అభినందిస్తూ, యోగాను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు.
పల్లవి ఇంజినీరింగ్ కాలేజీలో
అబ్దుల్లాపూర్‌మెట్, జూన్ 21: పల్లవి ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. యోగ , ఫిట్నెస్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకులు ఎ. విశ్వకుమార్ తన బృందంతో కలిసి యోగా శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి కాలేజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ మల్కా నవీన్ కుమార్ అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజీ డైరెక్టర్ డా. జె.వి.బి. సుబ్రహ్మణ్యం, ప్రిన్సిపాల్ డా. ఎం.బి. రాజు, వైస్ ప్రిన్సిపాల్ డా. ఆర్. ప్రశాంత్ కుమార్, ఏవో ఎ. శ్రీధర్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
జిల్లెలగూడలో ..
బడంగ్‌ఫేట్, జూన్ 21(విజయక్రాంతి): జిల్లెలగూడ చందన చెరువు వద్ద సత్యం యోగా సెంటర్, సబితమ్మ శక్తిదళ్ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్ర మంలో పెద్ద సంఖ్యలో మహిళలు, యువత పాల్గొని ఉత్సాహంగా యోగా సాధన చేశారు. ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని మాజీ కార్పొరేటర్ ఎనుగుల అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా యోగా సాధకులకు టీ-షర్టులు, వాట ర్ బాటిల్స్, పండ్లను పంపిణీ చేయడంతో పాటు యోగా గురువులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పలువురు మాజీ కార్పొరేటర్లు, స్థానిక నాయకులు మరియు యోగా గురువులు పాల్గొన్నారు.
రాయపోల్ గ్రామంలో..
ఇబ్రహీంపట్నం, జూన్ 21 (విజయక్రాంతి) : ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా రాయపోల్ గ్రామంలో నిర్వహించిన యోగ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బి ఆర్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బూడిద రామ్ రెడ్డిని ఆహ్వానించారు. విద్యార్థులు, యువత చెడు వ్యాసనాలకు దూరంగా ఉండాలి నిత్యం ఆరోగ్యంఫై దృష్టిసారించి బాగా చదువు కొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు ఈ కార్యక్రమంలో రాయపోల్ గ్రామ సర్పంచ్ అచ్చన మమత శ్రీశైలం రాయపోల్ హై స్కూల్ హెచ్‌ఎం వార్డు సభ్యులు వివిధ పార్టీనాయకులు, ఉ పాధ్యాయులు, యువకులు, విద్యార్థిని, విద్యార్థులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






