14-05-2025 01:26:18 AM
స్కిల్స్ వర్సిటీ క్యాంపస్ షురూ
హైదరాబాద్, మే 13(విజయక్రాంతి): తొలిదశలో భాగంగా మీర్‌ఖాన్‌పేట్‌లోని స్కిల్స్ యూనివర్సిటీ శాశ్వత క్యాంపస్‌లో అకడమిక్ విభాగం, ప్రయోగశాలలు, వసతిగృహాలు, వైస్‌చాన్సలర్ కార్యాలయాలను అందుబాటులోకి తీసుకొస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. వీటిని ఈ ఏడాది డిసెంబర్ 9న లాంఛనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు.
తెలంగాణను నైపుణ్య హబ్‌గా తీర్చిదిద్దేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ మార్గనిర్దేశంలో రాష్ర్టంలోని ప్రతీ జిల్లాకేంద్రంలో నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట్‌లోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మా ణ పనుల పురోగతిని మంగళవారం మంత్రి శ్రీధర్‌బాబు పరిశీలించారు.
అనంతరం కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనులు సకాలంలో పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి దిశానిర్దేశం చేశారు. పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య ఏర్పడిన అంతరాన్ని తగ్గించి, తెలంగాణ యువతకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతోనే అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్టు దుద్దిళ్ల పేర్కొన్నారు.
తెలంగాణ యువతలో ప్రతిభకు కొదవలేదని, వారికి శిక్షణ అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ర్టంలో ఓవైపు పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహిస్తూనే, మరోవైపు తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు.
ప్రస్తుతం స్కిల్స్ యూనివర్సిటీలో సంబంధిత దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో ఫార్మా, రిటైల్, లాజిస్టిక్స్, ఏవీయేషన్ అండ్ ఎయిర్‌పోర్ట్ మేనేజ్‌మెంట్ కోర్సులను అందిస్తున్నామని చెప్పారు. ఈ కోర్సులకు డిమాండ్ ఉందని, విజయవంతంగా పూర్తి చేసిన 70 శాతం నుంచి 80 శాతం మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయని మంత్రి వివరించారు.
ఏడాదిలోనే 57 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత ప్రజాప్రభుత్వానికే దక్కిందన్నారు. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తున్నామని శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఒకేసారి వంద అడుగులు వేయలేమని తెలిసినా కొందరు ప్రతిపక్షనేతలు తమపై దుష్ర్పచారానికి ఒడిగడుతున్నారని మంత్రి మండిపడ్డారు.
భావితరాల అవసరాల కోసం, సుస్థిరాభివృద్ధే లక్ష్యంగా అంతర్జాతీయ ప్రమాణాలతో నాలుగో నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తామని మంత్రి చెప్పారు. త్వరలోనే ఫ్యూచర్‌సిటీ అథారిటీ కార్యాలయాన్ని స్థానికంగా ప్రారంభిస్తామని పేర్కొన్నారు. సమీక్షలో యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ వీసీ వీఎల్వీఎస్‌ఎస్ సుబ్బారావు, ఓఎస్డీ కమ్ రిజిస్ట్రార్ చమాన్‌మెహతా, ఇతర ఉన్నతాధికారులు, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.