calender_icon.png 14 May, 2025 | 7:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేగంగా ధాన్యం కొనుగోళ్లు

14-05-2025 01:23:29 AM

  1. ఇప్పటివరకు 65% పూర్తి 
  2. యాసంగి కొనుగోళ్లలో తెలంగాణ రికార్డు 
  3. కొనుగోలు చేసిన ధాన్యం విలువ రూ.9,999.36 కోట్లు
  4. ఇప్పటివరకు ప్రభుత్వం చెల్లించింది 6,671కోట్లు
  5. హరీశ్ వాస్తవాలు తెలుసుకో.. అంటూ మంత్రి ఉత్తమ్ హితవు

హైదరాబాద్, మే 13 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా సాగుతోందని రాష్ట్ర పౌరసరఫరాల  శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ర్టవ్యాప్తంగా ఇప్పటివరకు 43.10లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అంటే  65 శాతం మేర ప్రభుత్వం కొనుగోలు చేసిందని పేర్కొన్నారు.

ధాన్యం కొనుగోళ్ల విషయంలో మాజీమంత్రి హరీశ్‌రావు అబద్ధాలు మాట్లాడుతున్నారని, ‘నిజాలు ఇదిగో.. అబద్ధాలు మానుకో ’ అంటూ మంత్రి హితవు పలికారు. ప్రతీరోజు అబద్ధాలను ప్రచారం చేస్తూ.. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్టు.. అసత్య ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మంగళవారం ఆయన ఒక ప్రకటనలో మండిపడ్డారు.

బీఆర్‌ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగమైనా.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి 281లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అయ్యిందని మంత్రి వివరించారు. యాసంగి సీజన్‌లో ఇప్పటికే 65 శాతం మేర ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయని, గతేడాది కంటే ఇప్పుడు 44 శాతం అధికమన్నారు.

గడిచిన రెండేళ్ల యాసంగి సీజన్‌తో పోల్చి చూస్తే ఇప్పుడు 120 శాతం అధికంగా ధాన్యం కొనుగోలు జరిగిందని, ఈ యాసంగి సీజన్‌లోనూ ధాన్యం దిగుబడిలో తెలంగాణ రాష్ర్టం రికార్డు సాధించిందని వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధికా రంలోకి వచ్చాక ఖరీఫ్ సీజన్‌లో 66.7 లక్షల ఎకరాలు సాగుచేస్తే 153.5 లక్షల మెట్రిక్ ట న్నుల ధాన్యం దిగుబడి అయ్యిందని, ప్రస్తుత యాసంగి సీజన్‌లో 55లక్షల ఎకరాల్లో సాగుచేస్తే 127లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా వేస్తున్నామని తెలిపారు. 

48గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు..

రాష్ర్టవ్యాప్తంగా 8,245ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, గతేడాది కంటే అదనంగా 1,067 ఏర్పాటు చేశామని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. ఈ యాసంగి సీజన్ లో 60.14 లక్షల ఎకరాల్లో రైతులు సాగుచేయగా లక్షా 29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుందని అంచనా వేశామని, అందులో 70.13లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తున్నట్లు చెప్పారు.

‘ఇప్పటివరకు రాష్ర్టవ్యాప్తంగా మొత్తం 6.58 లక్షల మంది రైతుల నుంచి కొనుగోలు చేసిన 43.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో 27.75లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డురకం, 15.35 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం ఉం ది. వీటి మొత్తం విలువ రూ. 9,999.36 కో ట్లు.. ఇప్పటివరకు రైతులకు రూ 6,671 కోట్లు చెల్లించాం.

కొనుగోలు చేసిన 48 గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాలలో నగదు జమ అవుతోంది. యాసంగిలోనూ సన్నాలకు రూ. 500బోనస్ ఇస్తున్నాం. రూ.767కోట్ల్ల బోనస్ చెల్లించాం’ అని మంత్రి ఉత్తమ్‌తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో వాస్తవాలు తెలుసుకోకుండా హరీశ్‌రావు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.