01-01-2026 12:00:00 AM
మొయినాబాద్, డిసెంబర్ 31(విజయ క్రాంతి): గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు దుర్మరణం చెందిన దుర్ఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన యువకుడు బక్కరెడ్డి రఘునాథ్ రెడ్డి (23) వృత్తి, వ్యవసాయం బుధవారం మధ్యాహ్నం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన బంధువులను పరామర్శించి తిరిగి నగరం నుంచి చేవెళ్ల వైపు (TS11 ER 3145) నెంబర్ గల తన ద్విచక్ర వాహనంపై మల్కాపూర్ తన గ్రామానికి వెళ్తుండగా మార్గ మధ్యలో మొయినాబాద్ లోని హైదరాబాద్-బీజాపూర్ రహదారి పక్కన ఉన్న తాజ్ హోటల్ సమీపానికి చేరుకోగా చేవెళ్ల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం అతివేగంతో ఎదురుగా ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
బక్కరెడ్డి రఘునాథ్ రెడ్డి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని బక్కరెడ్డి రఘునాథ్ రెడ్డి మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.