పాఠశాల అభివృద్ధికి యువత చేయూత
రూ. 13 వేల ఆర్థిక సాయం
కందుకూరు, మార్చి 6 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి యువత నడుం బిగించడం అభినందనీయమని కందుకూరు మండల పరిధిలోని కొత్తగూడ గ్రామ ప్రతినిధులు కొనియాడారు. పాఠశాలలో కలర్ ప్రింటర్ అవసరమని తెలుసుకున్న గ్రామానికి చెందిన యువకులు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.
కొత్తగూడ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కలర్ ప్రింటర్ కొరత ఉన్న విషయం తెలుసుకున్న యువకులు తల్లోజు నరేష్ చారి, తాళ్ల మహేందర్ ముదిరాజ్ లు స్పందించారు. ప్రింటర్ కొనుగోలు నిమిత్తం వారు సేకరించిన రూ.13,000 రూపాయల నగదును వార్డు సభ్యులు సౌడపు శేఖర్ గౌడ్ చేతుల మీదుగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రవీణ్ కుమార్కు అందజేశారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ప్రవీణ్ కుమార్ మరియు శేఖర్ గౌడ్ మాట్లాడుతూ..గ్రామంలోని యువత పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములు కావడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఇలాగే విద్యార్థుల బాగోగుల కోసం, పాఠశాల పురోగతికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు చేసే చిన్న సహాయమైనా వారి భవిష్యత్తుకు మరియు చదువుకు ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మహమ్మద్ అంజద్, బొక్క దీక్షిత్ రెడ్డి, యూత్ నాయకుడు బొక్క రాజశేఖర్ రెడ్డి మరియు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొని యువకుల చొరవను అభినందించారు.




