20-12-2025 12:00:00 AM
నంగునూరు, డిసెంబర్ 19: యువత వస్తేనే మార్పు సాధ్యమని నిరూపిస్తూ ఒకే కుటుంబానికి చెందిన అన్నాచెల్లెళ్లు వేర్వేరు గ్రామాల్లో సర్పంచులుగా గెలిచి విజయం సాధించారు.సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాల గ్రామానికి చెందిన ఇంగ నర్సింగరావు సంతానమే నరేష్, మానస ల విజేతలు.
పట్టువదలని విక్రమార్కుడు నరేశ్
గట్లమల్యాల గ్రామానికి చెందిన ఇంగ నరేశ్ (34)వ్యవసాయ కుటుంబం.గత ఎన్నికల్లో సర్పంచిగా పోటీ చేసి ఓటమి పాలై నప్పటికీ,ఆయన వెనకడుగు వేయలేదు. ఈసారి రెండో విడత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ త రపున బరిలోకి దిగి,తనదైన శైలిలో ప్రచారం నిర్వహించారు. ఎటువంటి రాజకీయ చరిత్ర లేని కుటుంబం నుంచి వచ్చిన నరేశ్, ఈసారి 335 ఓట్ల భారీ మెజారిటీతో యువ నాయకుడు గా విజయం సాధించాడు.
వెలికట్టలో మానస విజయకేతనం
నర్సింగరావు కుమార్తె, నరేశ్ సోదరి అయిన బూర్గుల మానస సురేందర్ (33) సైతం తనదైన ముద్ర వేశారు.గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాక మండలం వెలికట్ట గ్రామ సర్పంచ్గా ఆమె పోటీ చేశారు.మూడో విడత ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన మానస, తన ప్రత్యర్థిపై 301 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
పార్టీలు వేరైనా.. లక్ష్యం ఒక్కటే!
అన్న నరేశ్ ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలవగా, చెల్లెలు మానస అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. పార్టీల సిద్ధాంతాలు వేరైనా, తమ గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఈ అన్నాచెల్లెళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి,రాజకీయ చరిత్ర లేకపోయినా ఇద్దరూ సర్పంచులుగా ఎన్నికై తమ కుటుంబానికి రాజకీయ గుర్తిం పు తీసుకురావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.