14-05-2025 12:00:00 AM
కామారెడ్డి, మే 13 (విజయక్రాంతి): ‘ఇనుప కండరాలు ఉక్కు నరాలు కలిగిన యువకులు నాతో వంద మంది ఉంటే చాలు.. దేశ భవిష్యత్తును మార్చుతా’ నని చెప్పిన స్వామి వివేకానంద వచనం యువశక్తి గొప్పతనాన్ని చాటుతుంది. ‘కొంతమంది కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులు’ అన్న శ్రీశ్రీ పాటలో నిద్రావస్థలో ఉన్న యువశక్తిని మేల్కొలిపే ప్రయ త్నం దాగి ఉంది. అంటే యువత భావితరం.
వారిని నిద్ర లేపి చైతన్య పరిచి దేశ భవిష్యత్తు యువత పై ఆధారపడి ఉందని, యువశక్తి అసామాన్యమైనదని ఆనాడే చాటి చెప్పారు. గతం లో పట్టణాల్లో పల్లెల్లో ఎక్కడ చూసినా యువజన సంఘాలు ఏర్పాటు చేసుకునేవారు. ఐకమత్యంగా ఉండి పట్టణ, గ్రామాల అభివృద్ధికి తోడ్పడేవారు. బీఆర్ అంబేద్కర్, జ్యోతి బా పూలే, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, ఆజాద్ చంద్రశేఖర్ వంటి మహనీయుల ఆదర్శాలను విని, చదివి ఆచరించే యువత నేడు వెదికినా దొరకని పరిస్థితి కనిపిస్తుంది.
1980- 90 ప్రాంతంలో మహనీయుల పేరుపై యువజన సం ఘాలు పట్టణాలు, గ్రామాలలో ఏర్పాటు చేసుకొని సామాజికసేవకు చేరువయ్యేవారు. గ్రామాల్లో, పట్టణాల్లో జరిగే అన్యాయాలు, అక్రమాలపై గళం విప్పేవారు. సంఘంలోని సభ్యుల మంచి చెడులకు ముందుండి మేమున్నామంటూ ఐక్యతను ఆప్యాయతను పంచేవారు. అసమానతలను వ్యతిరేకించి మానవతా దృక్పథంతో ముందుకు రావాలని పిలుపునిచ్చేవారు.
నేటి యువతలో సామాజిక స్పృహ కరువు..
నేటి యువతలో అలాంటి సామాజిక స్పృహ కొరవడింది. సామాజిక మాధ్యమం చేరువైంది. విపరీత ధోరణుల సంతలో సరుకైంది. మత్తు కు బానిసైంది. చదువు కు దూరమైంది. భవిష్యత్తు ప్రశ్నార్ధకమైంది. 1980 -90లలో విద్యార్థి ఉద్యమాలు, యువజన సంఘాలు సామాజిక చైతన్యానికి చిహ్నంగా నిలిచాయి. రాజకీయ పార్టీలు, వామపక్ష ఉద్యమాలు ఆ సంఘాలను తమ భావాలకు అనుకూలంగా మలుచుకున్నాయి.
వామపక్ష సాయుధ ఉద్యమాలు, రాజ్యాలకు (ప్రభుత్వాలు)మధ్య పెరిగిన తీవ్రత యువజన సంఘాల ఉనికిని ప్రశ్నార్ధకంగా మార్చింది. ప్రజాస్వామ్యంలో అభిప్రాయ స్వేచ్ఛపై నిర్బంధం పెరిగింది. నిరసన తెలిపిన వారిపై కేసులు, అరెస్టులు, నిందలు. దీంతో యువజన సంఘాలు భద్రతా సమస్యలతో వెనక్కి నెట్టివేయబడ్డాయి.
నేటి యువత ఎక్కువగా వ్యక్తిగత ప్రయోజనాల వైపు పరుగులు పెడుతోంది. ఉద్యోగం, ఉన్నత విద్య, విదేశీ అవకాశాలు అనే లక్ష్యాల్లో సామాజిక బాధ్యత తలుపు తట్టినా తెరచుకోదు. ఒకవైపు ఇది సహజమే కానీ దీనివల్ల సామాజిక న్యాయం, సమాజ పట్ల నిబద్ధత వంటి విలువలు మరుగున పడుతున్నాయి.
డిజిటలైజేషన్ ప్రభావం..
నేటి డిజిటలైజేషన్ యువతకు కావాల్సిన సమాచారాన్ని అందిస్తున్నప్పటికీ అందులోని చెడుకే ప్రాధాన్యతనిస్తూ సమయాన్ని వృథా చేయడమే గాకుండా తమ మేధా ను నిద్రావస్థలో కి పంపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికలపై లైక్స్ , షేర్లు, హ్యాష్‌ట్యాగ్ ఉద్యమాలు ఎక్కువవుతున్నాయి.
కానీ వీటిలో నిజమైన ప్రభావం ఉన్నదా? సామాజిక మార్పు తీసుకురావడానికి ఈ వేదికలు సరిపోతాయా? భావోద్వేగం ఉన్నా, కార్యాచరణ సాధ్యమవుతుందన్నద అనేది ప్రశ్నార్ధకమే! గతంలో విద్యార్థి సంఘాలు నిజమైన ఉద్యమ కేంద్రాలుగా ఉండేవి. నేడు అవి రాజకీయ ప్రాబల్యానికి ఒక ఉపకరణంగా మారాయి. స్వార్థపర నాయకత్వం యువతలో నమ్మకాన్ని కోల్పోయేలా చేసింది.
సంఘటితకు గండి కొడుతున్న సామాజిక విభజన..
కులం, మతం, భాష, ప్రాంతీయత అనే గుర్తింపులు యువతను విభజిస్తున్నాయి. సామాజిక చైతన్యం వ్యక్తిగత సమూహ ఆదిపత్యాల్లో మునిగి పోతోంది. ఈ విభజన యువజన సంఘాల సంఘటితాన్ని బలహీనపరిచింది.
మత్తుకు చిత్తవుతున్న యువత..
డిజిటలైజేషన్, సామాజిక మాధ్యమం పెను ప్రభావం చూపడం.. ఒక ఎత్తయితే మత్తుకు బానిసలై జల్సాలకు సలాం కొట్టడం మరో ఎత్తు. నేటి ఆధునిక యవత కల్తీ కల్లు, మద్యం, గాంజా, డ్రగ్స్ వంటి వాటికి బానిసై, చదువు కు దూరమై తమ భవిష్యత్తు నే ఫణంగా పెట్టిన యువత కు సామాజిక స్పృహ కూర వడింది.
క్రీడలకు తగ్గిన ప్రాధాన్యత..
గతంలో యువజన సంఘాలు క్రీడల కు అధిక ప్రాధాన్యతనిచ్చేవి. నేడు ఒక క్రికెట్ తప్ప ప్రాం తీయ క్రీడ కబడ్డీ, జాతీయ, అంతర్జాతీయ క్రీడలైన షటిల్, బాల్ బ్యాడ్మింటన్, హాకీ, వాలీబాల్, ఫుట్బాల్, క్యారం, చెస్ వంటి వాటికి దూరమై సామాజిక మాధ్యమాల్లో ని ఆన్ లైన్ గేమింగ్ వైపు ఎక్కువగా యువత మళ్లారు. ఒకప్పుడు కళాశాలల గేట్లు ఉద్యమ నినాదాలతో ప్రతిధ్వనించేవి. నేడు అక్కడ మౌనం రాజ్యమేలుతోంది.
యువజన సంఘాలు సమాజ నిర్మాణానికి బలమైన స్తంభాలు. ఇవి తిరిగి చైతన్యవంతంగా మారాలంటే యువతలో సమాజపట్ల అభిమానం పెరగాలి. వారికి అవసరమైన మార్గదర్శనం, ప్రోత్సాహం ఇవ్వాలి. అప్పుడే యువ సమూహాలు మళ్లీ పునరుజ్జీవనం పొందుతాయి. ఇలాంటి సంఘాల పునరుద్ధరణ కోసం ప్రభుత్వాలు, విద్యా సంస్థలు, అభివృద్ధి సంస్థలు చురుకుగా ముందుకు రావాలి.
యువత తమలోని సామర్థ్యాన్ని గుర్తించి, సమాజానికి దోహదపడే దిశగా తిరిగి యువజన సంఘాలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ప్రభుత్వాలు గుర్తించాలి. ఎందుకంటే... యుద్ధాలు వస్తున్నాయ్...! యువత అడ్డదారులు తొక్క కుండ ప్రయోజకులుగా మారెందుకు యువజన సంఘాలు దోహా ధపడతాయి.
యువజన సంఘాల ఏర్పాటుకు కృషి చేస్తున్నాం..
పట్టణాల్లో గ్రామాల్లో యువతకు ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రీడలు నిర్వహిస్తున్నాం. నూతనంగా యువజన సంఘాలను ఏర్పాటు వాలంటీర్ సాయంతో ఏర్పాటు చేస్తున్నాం.
- జగన్నాథం,
జిల్లా యువజన క్రీడలశాఖ అధికారి, కామారెడ్డి