10-08-2025 01:41:06 AM
తీగ లాగితే కదిలిన గొర్రెల స్కాం డొంక.. సంచలనం సృష్టిస్తున్న కొనుగోళ్లు
-కొనుగోళ్లు, అమ్మకాలు లేకుండా వెయ్యి కోట్ల కుంభకోణం
-ఏపీ గొర్రెల పెంపకందారుల ఫిర్యాదుతో వెలుగులోకి..
-సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో ఏసీబీ విచారణ
-లబ్ధిదారులకు అందించే గొర్రెల యూనిట్ల రీసైక్లింగ్
-యూనిట్ రేటు పెంచిన దళారి మొయినుద్దీన్
-ఈడీ ప్రవేశంతో బయటపడుతున్న వాస్తవాలు
-7 జిల్లాల్లోనే రూ.253.93 కోట్ల అక్రమాలు
-మాజీమంత్రి తలసాని ఓఎస్డీ, అధికారి రాంచందర్‌నాయక్ ఇంట్లో సోదాలు
-స్కాంకు సంబంధించిన కీలక ఆధారాలు స్వాధీనం
-తేలాల్సిన రాజకీయ ప్రముఖుల పాత్ర
హైదరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): గొల్ల, కుర్మల ఉపాధి కోసం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకం గా ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకం లో తవ్విన కొద్దీ అక్రమాలు బయటకు వస్తున్నాయి. కేసు దర్యాప్తులో ముందుకు వెళుతున్న కొద్దీ తీగ లాగితే డొంక కదులుతుంది.
కుంభకోణంలో అధికారులు, దళారుల పాత్ర బయట పడుతున్నది. లబ్ధిదారుల ప్రమేయం లేకుండానే వారి పేరిట వేల కోట్లు దండుకున్నారు. గొర్రెల కొనుగోళ్లు, అమ్మకాలే లేకుండా గొర్రెల యూనిట్లను రీసైక్లింగ్ చేసి వెయ్యి కోట్లకు పైనే మాయం చేశారు. ఈ క్రమంలో గొర్రెల పంపిణీ స్కాంతో బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అవినీతి భాగోతం మరోసారి బయటపడింది.
ఉపాధికల్పనే లక్ష్యంగా ప్రారంభమై..
గొర్రెలు, మేకలను పెంచుకోవడం ద్వారా పేదలకు జీవనోపాధిని కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం 2017 జూన్ 20వ తేదీన గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ప్రారంభానికి కొన్ని రోజుల ముందే రాష్ర్ట వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో యాదవ సంఘాలను ఏర్పాటు చేశారు. ఈ సంఘాల్లోని సభ్యులకు గొర్రెలు, మేకలను ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందించేది. ఒక్కో యూనిట్‌లో 21 గొర్రెలుంటాయి.
ఒక్క యూనిట్‌కు రూ. 1.25 లక్షలను చెల్లించాలని ఆనాటి ప్రభు త్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఆ తర్వా తి కాలంలో దీన్ని రూ.1.75 లక్షలకు పెం చారు. ఈ యూనిట్ కింద లబ్ధిదారులు రూ. 43,750 చెల్లిస్తే మిగిలిన రూ.1,31,250 లను ప్రభుత్వం సబ్సిడీగా అందించేది. గ్రామ సభలను ఏర్పాటు చేసి ఆ గ్రామసభల్లో లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఒక్క గ్రామంలోని సంఘంలో 40 మంది సభ్యులుంటే 20 మందికి మొదటి విడతలో, రెండో విడతలో మరో 20 మందిని ఈ పథ కం కింద ఎంపిక చేశారు. తొలి విడత 20 మందిని లాటరీ ద్వారా గుర్తించారు.
పథకం అమలుకు నిబంధనలివే
లబ్ధిదారులు కోరుకున్న గొర్రెలను పశుసంవర్ధక శాఖ అధికారులు కొనుగోలు చేసి ఇచ్చేవారు. గొర్రెలను లబ్ధిదారుడి గ్రామాని కి తరలించేందుకు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వం భరించేది. లబ్ధిదారుల ఇంటికి చేరిన గొర్రెలకు వారం రోజుల పాటు అవసరమైన ఫీడ్, మందులను కూడా ప్రభుత్వం అందించాలని నిబంధనలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలోనే తెలంగాణ అధికారులు ఎక్కువగా గొర్రెలను కొనుగోలు చే శారు.
గొర్రెల చెవులకు అక్కడే ట్యాగ్‌లు వేసి ఇందుకు సంబంధించిన యాప్‌లో ఈ ఫోటోలను అప్‌లోడ్ చేసేవారు. గొర్రెలను విక్రయించిన వారి బ్యాంకు ఖాతా వివరాలు, వారి ఆధార్ కార్డు వివరాలను తీసు కొని నగదును బదిలీ చేయాలి.ఈ పథకం ప్రారంభంలో నిబంధనల మేరకు అధికారులు నడుచుకున్నారు. అయితే దళారులు, ఉన్నతస్థాయిలో అధికారులు కుమ్మక్కున తర్వాత పథకం స్వరూపమే మారిపోయింది.
అవినీతిలో అధికారుల పాత్ర
ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెలను కొనుగోలు చేసేందుకు వెళ్లే సమయంలో పశుసంవర్ధక శాఖాధికారులు ట్రాన్స్‌పోర్ట్ సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. అయితే దళారులు లబ్ధిదారుడి నుంచి తాను అమ్మిన గొర్రెలను తిరిగి కొనుగోలు చేసి తీసుకెళ్లే సమయంలో చెక్ పోస్టులు, రాష్ర్ట సరిహద్దుల వద్ద పోలీసులు పట్టుకొనేవారు. ఇందుకు సంబంధించి రాష్ర్టంలోని పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి.
ఈ విషయమై పశుసంవర్థక శాఖ అధికారులతో కలిసి పోలీసులు లోతుగా విచారిస్తే గొర్రెల యూనిట్లు రీసైక్లింగ్ అంశం బయటకు వచ్చేది. కానీ పశుసంవర్థకశాఖ ఉన్నతాధికారులు, దళారులతో కుమ్మకైనందున ఈ అంశం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 2018లో కేసీఆర్ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఈ సమయంలోనే ఈ పథకం అమల్లో ఇష్టానుసారంగా వ్యవహరించారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
దళారుల ఖాతాల్లో డబ్బులు జమ
గొర్రెలను విక్రయించిన వారికి కాకుండా దళారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయడం వల్ల ఈ కుంభకోణం వెలుగు చూసింది. ఏపీలోని ప్రకాశం, గుంటూరు, పల్నాడు జిల్లాలకు చెందిన 18 మంది గొర్రెల పెంపకందారులు హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఈ ఏడాది జనవరి 26న ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఐపీసీ 406, 409, 420 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే ఈ కేసు నమోదు కావడానికి ముందే పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో కీలక ఫైళ్లు మాయం చేశారని ఆ శాఖ అధికారులు అప్పట్లో నాం పల్లి పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. నాంపల్లి పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ఈ సమయంలోనే రంగారెడ్డి జిల్లాలో ఈ స్కీంలో అవకతవకలు జరిగాయనే అంశం వెలుగులోకి వచ్చింది. ఈ స్కాంపై రేవంత్‌రెడ్డి సర్కార్ ఏసీబీ విచారణకు ఆదేశాలు జారీ చేసింది.
ఏసీబీ ఆరా
గొర్రెల పంపిణీలో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో కాం గ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమగ్ర విచారణకు ఆదేశించింది. ఈ మేరకు ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. దాదాపు రూ. 700 కోట్ల మేర అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అనేకమందిని ఏసీబీ దర్యాప్తు చేసింది.
పశుసంవర్థక శాఖ అధికారులు లబ్ధిదారుల కోసం తెలంగాణలో గొర్రెలను కొనుగోలు చేయకుండా, వారిని ఏపీకి తీసుకెళ్లి అక్కడి వ్యాపారుల నుంచి కొనుగోలు చేయించారు. అయితే యూనిట్లకు చెల్లించాల్సిన సొమ్మును నేరుగా ఇవ్వకుండా మధ్యవర్తులు, బినామీల ఖాతాలకు మళ్లించినట్టు దర్యాప్తులో తేలింది. ప్రత్యేకంగా బ్రోకర్లను, ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని ఏకంగా రూ.2.1 కోట్లను దారి మళ్లించినట్టు ఏసీబీ గుర్తించింది.
ఈ నిధులు ఎక్కడికి వెళ్లాయనే కోణంలో ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు కొనసాగించారు. బినామీ ఖాతాదారులను విచారిం చగా బ్రోకర్లు, ప్రభుత్వ అధికారుల కీలకపాత్రకు సంబంధించిన బలమైన ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ మొత్తం కుంభకోణంలో గొర్రెల కొనుగోలు కాంట్రాక్టర్‌గా వ్యవహరించిన మోయినుద్దీన్ సూత్రధారిగా వ్యవహరించాడని ఏసీబీ అధికారులు నిర్ధారించారు. అతడు అధికారులతో కుమ్మక్కై నిధులను బినామీ ఖాతాలకు మళ్లించడంలో కీలక పాత్ర పోషించినట్టు తెలిసింది.
మోయినుద్దీన్ ఎంట్రీతో..
వాస్తవానికి గొల్ల కుర్మలకు పంపిణీ చేసే యూనిట్‌లో 20 గొర్రెలు, ఒక పొట్టేల్ ఉంటాయి. ఈ యూనిట్ ధరను 1.25 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అప్పటి ప్రభుత్వంలోని కొంతమంది ముఖ్య నేతలతో సన్నిహత సంబంధాలు ఉన్న ప్రైవేటు కాంట్రాక్టర్ మోయినుద్దీన్, అతని కుమారుడు ఇక్రముద్దీన్‌లు ఎంట్రీ ఇచ్చిన తర్వాత స్కీం స్వరూపమే మారిపోయింది.
అప్పటివరకు 1.25 లక్షలుగా ఉన్న యూనిట్ ధరను ప్రభుత్వం ఆమోదం లేకుండానే రూ.1.75 లక్షలకు పెంచారు. గొర్రెల విక్రయదారుల నుంచి వాటిని కొని చెల్లించాల్సిన డబ్బులను తమ సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. ఏపీకి చెందిన ఏడుకొండలు తోపాటు మరికొందరు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ నుంచి కొం దరు ప్రభుత్వ అధికారులు, మోయినుద్దీన్, ఇక్రముద్దీన్ కలిసి గొర్రెలు కొని ఇవ్వాల్సిన నిధులను సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పథకంలోని కుంభకోణం బట్టబయలైంది.
రంగంలోకి దిగిన ఈడీ
గొర్రెల పథకంలో మనీలాండరింగ్ జరిగిందని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ కేసును విచారించాలని ఈడీని ఏసీబీ కోరడంతో ఈడీ రంగంలోకి దిగింది. ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ అధికారులు జూన్ 13న ఈసీఐఆర్‌ను నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.
గత ప్రభు త్వ హయాంలో ప్రవేశపెట్టిన గొర్రెల పంపి ణీ పథకంలో రూ.వెయ్యి కోట్లకు పైగానే అవినీతి జరిగినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రాథమిక దర్యాప్తులో తేల్చింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ స్కామ్‌లో భారీ అవినీతి చోటు చేసుకుందని ఈడీ ఆరోపించింది. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గొర్రెల పంపిణీ పథకంలో భారీ అవకతవకలు జరిగాయని ఏసీబీ ఇప్పటికే రెండు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసింది.
తలసాని ఓఎస్డీ ఇంట్లో సోదాలు
గత ప్రభుత్వంలో పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్‌యాదవ్ వద్ద ఓఎస్డీగా పనిచేసిన జి. కల్యాణ్‌కుమార్, పశుసంవర్థక శాఖ మాజీ డైరెక్టర్ రాంచందర్ నాయక్, ఇతర లబ్ధిదారులు, మధ్యవ ర్తుల నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల్లో అనేక ఆధారాలు సేకరించారు.
ప్రభుత్వ అధికారులకు ముడుపుల రూపంలో అక్రమ చెల్లింపులు జరిగిన ట్లు సూచించే పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కళ్యాణ్ ఇంట్లో 200కుపైగా బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన చెక్‌బుక్‌లు, పాస్‌బుక్‌లు, డెబిట్‌కార్డులు, 31 సెల్ ఫోన్లు, 20 సిమ్‌కార్డులను గుర్తించి వాటిని సీజ్ చేశారు. గొర్రెల స్కాం కోసం ఉపయోగించిన బ్యాంక్ ఖాతాలనే ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌లోనూ ఉపయోగించినట్లు ఈడీ దర్యాప్తులో గుర్తించింది.
కాగా తెలంగాణలోని 7 జిల్లాల్లోనే రూ.253.93 కోట్ల అక్ర మాలు జరిగినట్లు గతంలో కాగ్ ఇచ్చిన నివేదికలో తెలిపింది. అయితే 33 జిల్లాల్లో కూపీ లాగితే రూ. 1000 కోట్లకు పైనే అక్రమాలు జరిగినట్లు ఈడీ వెల్లడించింది. అంతేకాక ఈ కేసులో లబ్ధిదారుల వివరాలను పొందుపచకపోవడం, రవాణా ఇన్వాయిస్ రికార్డులు అసంపూర్ణంగా ఉండటం, నకిలీ వాహన నంబర్లతో కూడిన ఇన్వాయిస్‌కు చెల్లింపులు చేయడం వంటి అనేక అవకతవకలను అధికారులు గుర్తించారు. ఇంకా దారుణం ఏం టంటే చనిపోయిన/ఉనికిలో లేని వ్యక్తుల పేరుతో కూడా గొర్రెల యూనిట్లను కేటాయించినట్లు దర్యాప్తులో తేలింది.
తలసాని ప్రమేయం ఉందా?
గొర్రెల పంపిణీ స్కాంపై ఈడీ దర్యాప్తు తెలంగాణలో సంచలనం సృష్టించింది. రూ. వెయ్యి కోట్ల స్కాం అంటే చిన్న విషయం కాదని, ఇందులో రాజకీయ నేతల ప్రమే యం ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈడీ తదుపరి దర్యాప్తులో ఈ అంశంపై దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా ఉన్నప్పుడు.. ఓఎస్డీగా ఉన్న కల్యాణ్ కుమార్ ఈ స్కాంలో కీలక వ్యక్తిగా ఉన్నారు.
ఆయన ఇంట్లో పెద్ద ఎత్తున డబ్బులు స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. ఈ కారణంగా తలసానికి కొత్త సమస్యలు వస్తాయని భావిస్తున్నారు. ప్రభుత్వం మారినప్పుడు కల్యాణ్ కుమార్ పెద్దఎత్తున డాక్యు మెంట్లను తరలిస్తూ దొరికిపోయారు. కొన్ని డాక్యుమెంట్లను ధ్వంసం చేసినట్లుగా గుర్తించారు. ఇప్పటికీ తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం కూడా ఏసీబీ ద్వారా విచారణ జరుపుతోం ది.
ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగి రూ. వె య్యి కోట్ల స్కాం అని చెప్పడంతో ఏసీబీ కూ డా దూకుడుగా దర్యాప్తు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నాయి. గొర్రెల పథకం స్కాంలో ఈడీ దర్యాప్తులో ఇంకా ఎలాంటి అంశాలు వెలుగు చూస్తాయనే అంశం సర్వత్రా ఉత్కంఠగా మారింది. దీని వెనుక కీలకపాత్రధారులు, సూత్రధారులు బయటపడతారా అనే చర్చ సాగుతుంది.
బైక్‌పై 126 గొర్రెలు తరలింపు
గొర్రెల పథకం స్కాంకు సంబంధించి కాగ్ రిపోర్ట్ కీలక అంశాలను ప్రస్తావించింది. లాజిక్ లేకుండా అధికారులు తప్పుడు బిల్లులు సృష్టించారని ఈ నివేదిక వివరించింది. ఒక్క వాహనం 24 గంటల వ్యవధిలో వేలాది కిలోమీటర్ల దూరం తిరిగినట్టుగా బిల్లులు పెట్టిన అంశాన్ని కాగ్ ఎత్తిచూపింది. గొర్రెల రవాణా కోసం వాహనాలను సమకూర్చుకొనేందుకు కలెక్టర్ నేతృత్వంలో కమిటీ తక్కువ కోట్ చేసిన కాంట్రాక్టర్‌కు టెండర్‌ను ఇచ్చింది.
ఈ కాంట్రాక్టరే జిల్లా వ్యాప్తంగా గొర్రెల యూనిట్ల రవాణ కోసం వాహనాలను సమకూరుస్తారు. గొర్రెల యూనిట్ ను లబ్ధిదారులకు అందించినట్టుగా యాప్‌లో పశువైద్యాధికారులు ప్రొసీజర్‌ను పూర్తిచేసిన తర్వాత ఈ డబ్బులు విడుదల చేస్తారు. బైక్, కార్లు, అంబులెన్స్ వంటి వాటిలో కూడా గొర్రెలను లబ్ధిదారు ఇంటికి చేర్చినట్టుగా బిల్లులు సమర్పించిన విషయాన్ని కాగ్ నివేదికలో పేర్కొంది.
సంగారెడ్డి జిల్లాలో హీరో హోండా బైక్‌పై 126 గొర్రెలు, ఖమ్మంలో అంబులెన్స్‌లో 84 గొర్రెలు, మహబూబ్ నగర్‌లో ఇండికా కారులో 168 గొర్రెలను తరలించినట్టుగా కాంట్రాక్టర్లు బిల్లులు పెట్టారు. ఏడు జిల్లాల్లోనే రూ. 253.93 కోట్లు దుర్వినియోగమైనట్టుగా నివేదిక చెబుతోంది. అయితే కొన్ని జిల్లాల్లో వాహనాల బిల్లులు సమర్పించే సమయంలో ఒక్క వాహనాల నెంబర్లలో ఒక్క నెంబర్ పొరపాటున రాసిన సందర్భాల్లో బిల్లులను నిలిపివేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఒక జిల్లాలో సుమారు 1,100 యూనిట్లకు డబ్బులను ప్రభుత్వం మంజూరు చేయలేదని తేలింది.