యువత జాతీయ సమైక్యతను బలోపేతం చేస్తూ ముందుకు సాగాలి
హనుమకొండ,(విజయక్రాంతి): యువత దేశభక్తి భావంతో జాతీయ సమైక్యతను బలోపేతం చేస్తూ ముందుకు సాగాలని వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బజ్జ్పాయ్ అన్నారు. మేరా యువ భారత్ వరంగల్, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఐదు రోజుల అంతర్రాష్ట్ర యువజన సమ్మేళన కార్యక్రమం ఈ నెల 5 నుంచి 9 వరకు హనుమకొండ బాలసముద్రంలోని యూత్ హాస్టల్‌లో విజయవంతంగా నిర్వహించారు. ఈ రోజు నిర్వహించిన ముగింపు సమావేశానికి వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పయి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ అంతర్రాష్ట్ర సమ్మేళనంలో కేరళ రాష్ట్రానికి చెందిన 37 మంది యువతీ-యువకులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను అవగాహన చేసుకోవడం, చారిత్రక ప్రదేశాల సందర్శన ద్వారా వాటి ప్రాముఖ్యతను తెలుసుకోవడం, ఇతర రాష్ట్రాల యువత తమ సంస్కృతి సంప్రదాయాలను స్థానిక యువతకు పరిచయం చేయడం, జాతీయ సమైక్యతను పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. ఈ సందర్భంగా కమిషనర్ చాహత్ బాజ్పయి మాట్లాడుతూ విభిన్న మతాలు, భాషలు, సంస్కృతులు కలిగిన భారతదేశంలో యువత దేశభక్తి భావంతో జాతీయ సమైక్యతను బలోపేతం చేస్తూ ముందుకు సాగాలని అన్నారు. యువత నైతిక విలువలను నేర్చుకోవాలని, ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా సేవ రంగాలపై కూడా యువత దృష్టి సారించాలని చెప్పారు.
విద్యా, వైద్య రంగాల్లో యువత మరింత పురోగతి సాధించాలని అన్నారు.సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత మాట్లాడుతూ... యువత శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకొని, సాంఘిక రుగ్మతలపై ప్రజలను చైతన్యం చేయవలసిన అవసరం ఉందని, ముఖ్యంగా మాదకద్రవ్యాలు, మొబైల్ అడిక్షన్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ షిప్ ఆధ్వర్యంలో నడపబడుతున్న జన శిక్షణ సంస్థాన్ డైరెక్టర్ ఖాజా మసియోద్దీన్ మాట్లాడుతూ యువత నైపుణ్యలను అలవర్చుకుంటేనే భవిష్యత్ లో ఉపాధి అవకాశాలు ఉంటాయని తెలిపారు.
అనంతరం కేరళ రాష్ట్రం నుండి పాల్గొన్న యువతకు సర్టిఫికెట్లు మరియు మెమొంటోలను ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో మేరా యువ భారత్ వరంగల్ ఉప సంచాలకులు చింతల అన్వేష్, జాతీయ యువజన అవార్డు గ్రహీత డాక్టర్ ఆకులపేల్లి మధు, సూపరింటెండెంట్ దేవి లాల్, ఖమ్మం సూపరింటెండెంట్ భాను, జన శిక్షణ సంస్థాన్ ప్రతినిధి డా. తిరుపతి, మై భారత్ వాలంటీర్లు వెల్దండ సురేష్, నవీన్ యాదవ్, వస్థల్య, హార్షిని కర్ణాటక రాష్ట్ర యువజన ప్రతినిధులు, స్థానిక యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు.




