16-01-2026 02:22:16 PM
నంగునూరు, విజయక్రాంతి: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలనే ఉద్దేశంతో నంగునూరు మండలం గట్లమల్యాల గ్రామంలో శుక్రవారం 'యాంటీ డ్రగ్ అండ్ హెల్త్ అవేర్‌నెస్ 5కే రన్' ఉత్సాహంగా జరిగింది.వంటేల గోపాల్ రెడ్డి జ్ఞాపకార్థం ఆయన భార్య లక్ష్మి, కుమారుడు జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.రాజగోపాలపేట ఎస్సై టి.వివేక్ ఈ పరుగును జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "మత్తు కాదు జీవితం కావాలి" అనే నినాదంతో యువత తమ ఉన్నత లక్ష్యాల వైపు పయనించాలని పిలుపునిచ్చారు.ప్రతి ఒక్కరూ డ్రగ్స్ రహిత గ్రామాల ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతూ,ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన వంటేల కుటుంబ సభ్యులను అభినందించారు.అనంతరం పోటీలో ప్రతిభ కనబరిచిన దండ్ల మల్లేశం (ప్రథమ),బానోతు రోహిత్ (ద్వితీయ),దండ్ల చందు (తృతీయ)లకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇంగే నరేష్, ఉప సర్పంచ్ శ్రీనివాస్, ఆరోగ్య శాఖ సిబ్బంది ,గ్రామ యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.