13-05-2025 07:11:45 PM
విలేకరుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి...
టేకులపల్లి (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువవికాసం పథకం(Rajiv Yuva Vikasam Scheme) జూన్ రెండు నుంచి అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క మల్లు(Minister Bhatti Vikramarka) అన్నారు. టేకులపల్లి మండల పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య(MLA Koram Kanakaiah) ఇంట్లో భోజన విరామం అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 15వ తేదీ వరకు జిల్లా స్థాయి అధికారుల పరిశీలన అవుతుందని, 28 వరకు పూర్తి రూపం దాల్చగానే రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్బంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.
జూన్ నెలాఖరు వరకు తుది రూపుదిద్దుకుంటుందని భట్టి తెలిపారు. సిబిల్ స్కోర్ అడ్డంకిగా రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నిరుద్యోగులు లేకుండా ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందన్నారు. సీతారామ ప్రాజెక్ట్ ద్వారా టేకులపల్లి, ఇల్లందు, బయ్యారం, గార్ల, ఇతర ప్రాంతాలకు నీరందించేందుకు త్వరలో అధికారుల సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామన్నారు. బయ్యారం పెద్ద చెరువు ద్వారా మహబూబాబాద్ జిల్లా, ఖమ్మం జిల్లాలకు నీరందించే చర్యలు చేపడతామన్నారు. రెండు లక్షల వరకు రుణమాఫీ పూర్తి అవుతునందన్నారు. కార్యక్రమంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పి రోహిత్ రాజ్, భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్, సింగరేణి సిఎండి బలరాం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.