13-05-2025 07:00:39 PM
నిర్మల్ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో విద్యావిధానాన్ని మరింత సులభతరం చేసేందుకు బోధనా విధానంపై ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు(District Education Officer Rama Rao) తెలిపారు. మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని నారాయణ పాఠశాలలో ఉపాధ్యాయుల శిక్షణ తరగతులను ప్రారంభించి మాట్లాడారు. ఉపాధ్యాయులు ఎంతో ఉన్నతమైన ఉపాధ్యాయవృత్తిలో ఉన్నారని, వీరి వల్ల దేశ భావి భారత ప్రగతి నిర్దేశించబడుతుందని, కావున ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు తమ బోధనా నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని, వాటి ద్వారా విద్యార్థులకు చక్కని బోధన అందించాలని ఆయన సూచించారు.
ఇందుకోసం రాష్ట్రస్థాయి అధికారులు నిర్దేశించిన విధంగా ఇచ్చే ఈ ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం డిఆర్పిలు హైదరాబాద్ లో శిక్షణ పొందారని, వీరికి ఈ రోజు ఉదయం జూమ్ ద్వారా శిక్షణ కార్యక్రమం విజయవంతం చేయడానికి తగిన సూచనలు అందించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ శిక్షణలో ఉపాధ్యాయులు అభ్యసన ఫలితాలు, విభిన్న బోధన మెలకువలు, డిజిటల్ బోధన, కృత్రిమ మేధ ఉపయోగించి అభ్యాసాలు కల్పించడం, జీవన నైపుణ్యాలు అందించడం, పనితీరు మెరుగుపరచుకోవడం, నూతన సాంకేతికతలు అలవర్చుకోవడం వంటి అంశాల గురించి, శిక్షణలో వివరాలు అందిస్తారని, వీటిని ఉపాధ్యాయులు చక్కగా అవగాహన చేసుకుని, తమ తరగతి గతి బోధనలో వినియోగించుకోవాలని తెలియజేశారు.
జిల్లాలో ఐదు రోజుల శిక్షణను నారాయణ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, గణితం విషయాలు, ఎస్జీటీ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం ఉపాధ్యాయులకు, చాణక్య పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ సోషల్, అందరూ ప్రత్యేక ఉపాధ్యాయులకు, బోధకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. ఈ శిక్షణకు ఉపాధ్యాయులు సమయానుసారం హాజరై, సమయ పాలన పాటించి, షెడ్యూల్ ప్రకారం జరుపు శిక్షణలో విషయాలను చక్కగా నేర్చుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి, ఎఫ్ఏఓ రమణారెడ్డి, అకడమిక్ మానిటరింగ్ అధికారి నర్సయ్య, కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి ప్రవీణ్ కుమార్, ఆయా విషయ కోర్స్ ఇంచార్జిలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.