13-05-2025 11:25:59 PM
ఎమ్మెల్యే పాయల్ శంకర్..
ఆదిలాబాద్ (విజయక్రాంతి): జూన్ మాసంలో వ్యవసాయ పనులు మొదలుకానున్న నేపథ్యంలో రైతులు పండించిన జొన్న పంటను మే మాసం లోపే పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్(MLA Payal Shankar) అధికారులకు సూచించారు. సాత్నాల మండల కేంద్రంలోని జోన్నల కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. జొన్నల కొనుగోలుపై అసెంబ్లీలో మాట్లాడంతో పాటు వ్యవసాయ శాఖ మంత్రికి విన్నవించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ జిల్లాలో రైతులు పండించిన జొన్నలను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు.
నియోజకవర్గంలో ఇప్పటి వరకు 30 నుండి 35 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయడం జరిగిందని, అకాల వర్షాలని పద్యంలో త్వరితగతిన కొనుగోలను పూర్తి చేయాలని కోరారు. త్వరలో కలెక్టర్, మార్క్ఫెడ్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రాలను పెంచేందుకు కృషి చేస్తానని అన్నారు. మహారాష్ట్ర నుండి తెచ్చిన జొన్నలను కొందరి రైతుల పేరిట అమ్ముతున్నారనే సమాచారం అందిందని, ఇలా చేస్తే మన రైతులే నష్టపోతారని తెలిపారు. ఇప్పటికే పలు చెక్పోస్ట్లను ఏర్పాటు చేశామని అన్నారు. రైతులు తమ గ్రామానికి ఇచ్చిన తేదీల ప్రకారం, ప్రభుత్వ నిబంధనల మేరకు జొన్న పంటను తీసుకువచ్చి విక్రయించుకోవాలని సూచించారు. పలువురు బీజేపీ నాయకులు, అధికారులు ఉన్నారు.