calender_icon.png 26 August, 2025 | 2:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుణెలో జికా వైరస్ కలకలం

03-07-2024 04:06:53 AM

  • ఆరుగురికి పాజిటివ్.. వారిలో ఇద్దరు గర్భిణులు 
  • మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్

పుణె, జూలై 2 : మహారాష్ట్రలో జికా వైరస్ విజృంభిస్తోంది. ఒక్క పుణెలోనే దాదా పు ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జికా వైరస్‌కు ఎఫెక్ట్ అయిన వారిలో ఇద్దరు గర్భిణి స్త్రీలు కూడా ఉన్నారు. దీంతో రాష్ట్ర ఆరోగ్య విభాగం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తి నివారణకు పుణె మున్సిపల్ అధికారులు చర్యలు మొదలు పెట్టారు. జికా వైరస్ వ్యాప్తికి కారణమైన దోమలను నిర్మూలించేందుకు నగరంలో విస్తృతంగా ఫాగింగ్ కార్యక్రమాలు చేపట్టారు.

జికా వైరస్ తొలి కేసు అరంద్వానేలో నమోదైంది. 46 ఏళ్ల డాక్టర్ తొలుత జికా వైరస్ బారిన పడ్డారు. అనంతరం అతని కుమార్తె (15)కు వైరస్ సోకినట్లు వైద్య పరీక్షల్లో నిర్దారణ అయ్యిం ది. వీరిద్దరితో పాటు ముండ్వాకు చెందిన ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ నలుగురితో పాటు అరంద్వానేకు చెందిన మరో ఇద్దరు గర్భిణులకు సైతం జికా వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

జికా వైరస్ విజృంభనపై పుణె ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ “ఇప్పటివరకు 20 శాంపిల్స్‌ని టెస్ట్ చేశాము. ఆరుగురికి జికా వైరస్ సోకినట్లు తేలింది. ఈ వైరస్ సోకిన 80 శాతం మందిలో వెంటనే లక్షణాలు బయటపడవు. అందుకే వైరస్ సోకిందని తెలియడానికి చాలా సమయం పడుతోంది. చికిత్స అందించేందుకు ఆలస్యమవుతోంది.” అని పేర్కొన్నారు.

గర్భిణి స్త్రీలకు సోకే అవకాశం..

జికా వైరస్ అనేది ఏడిస్ దోమల ద్వారా సంక్రమించే వ్యాధి. ఏడిస్ దోమ డెంగ్యూ, చికెన్ గున్యా, ఎల్లో ఫీవర్ అనే మూడు ఇతర వ్యాధులను కూడా వ్యాప్తి చేస్తుంది. ఈ వైరస్‌ను తొలిసారి ఉగాండాలో 1947లో కనుగొన్నారు. ఈ వైరస్ సోకిన వారిలో జ్వరం, చర్మంపై దద్దుర్లు, కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, జీర్ణకోశ సంబంధ సమస్యలు, గొంతు నొప్పి, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రధానంగా గర్భిణి స్త్రీలు తేలిగ్గా ఈ వైరస్ బారిన పడే ప్రమాదం ఉంది.