26-08-2025 01:31:15 PM
ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా..
పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ బండి..
కరీంనగర్ (విజయక్రాంతి): దొంగ ఓట్లతో బీజేపీ నేతలు గెలిచారంటూ పీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ చేసిన ఆరోపణలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar) తీవ్రంగా స్పందించారు. అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే కాబట్టి వెంటనే దొంగ ఓట్ల జాబితాను బయటపెట్టండి. ఆ దొంగ ఓట్లను తొలగించాలని ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాయండి. ఆ తరువాత అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికల్లో వెళ్లండి. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. దీనికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమా? ’’అంటూ సవాల్ విసిరారు. పార్లమెంట్ ఎన్నికల్లో 2 లక్షల 25 వేల భారీ మెజారిటీతో గెలిపిస్తే దొంగ ఓట్లంటూ కరీంనగర్ ప్రజలను కాంగ్రెస్ అవమానిస్తోందని మండిపడ్డారు. ఈ దేశంలో 20 నెలల పాలనలో పంచాయతీలకు నయాపైసా ఇయ్యని పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ మాత్రమేనని విమర్శించారు.
పంచాయతీలకు అప్పుడైనా, ఇప్పుడైనా నిధులిస్తోంది కేంద్ర ప్రభుత్వమేనన్నారు. ఆ కేంద్ర నిధుల కోసమే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించుకుంటున్నారే తప్ప ఎన్నికలు జరపాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ కు లేనేలేదని అన్నారు. మంగళవారం కరీంనగర్ వచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ను మీడియా ప్రతినిధులు కలిసి మహేశ్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా స్పందిస్తూ మహేశ్ గౌడ్ పైనా, కాంగ్రెస్ నేతలపైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహేశ్ గౌడ్ పై నాకు వ్యక్తిగత కక్ష లేదు. ఆయన ఏం మాట్లాడారో ఆయనకే తెలియనట్లుందన్నారు.
ఒక్కసారైనా వార్డు మెంబర్ గానో, ప్రజాప్రతినిధిగానో గెలిచి ఉంటే ఓట్ల చోరీ సంగతి తెలిసేది. ఆయన ఒక్కసారి కూడా వార్డు మెంబర్ గా కూడా గెలవని వ్యక్తి. ఓట్ల చొరీ సంగతి ఆయనకేం తెలుసు అన్నారు. కరీంనగర్ లో ఒక ఓటు వేసి జగిత్యాలలో మరో ఓటు చొప్పదండిలో ఇంకో ఓటు వేయడం సాధ్యమైతదా? ఆయన ఎట్లా మాట్లాడతారు? నన్ను కరీంనగర్ ప్రజలు 2 లక్షల 25 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిపించారు. ఆయనేమో దొంగ ఓట్లతో గెలిచారని చెప్పి కరీంనగర్ ప్రజలను అవమానిస్తున్నారన్నారు. నేను సవాల్ చేస్తున్నా. అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే కదా. దొంగ ఓట్ల జాబితాను బయటపెట్టి వాటిని తొలగించాలని ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాయండి. ఆ తరువాత అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్దాం. ఒకవేళ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారు.