బీమా పథకంపై అధికారులకు పూర్తి అవగాహన
భైంసా, (విజయక్రాంతి): ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలులో భాగంగా క్షేత్రస్థాయి అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు(Additional Collector Venkateshwarlu) ఆదేశించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి పథకం ప్రయోజనం అందేలా దరఖాస్తుల నమోదు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి సంబంధిత క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పథకం అమలు, దరఖాస్తుల నమోదు విధానంపై సమీక్షించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. బీమా దరఖాస్తులను పూర్తి వివరాలతో, అత్యంత జాగ్రత్తగా నమోదు చేయాలని సూచించారు. కుటుంబ సభ్యుల పేర్లు, నామినీ వివరాలు, నామినీ వాటా, ఆధార్, రేషన్ కార్డు వివరాలు తదితర సమాచారాన్ని తప్పులు లేకుండా స్పష్టంగా నమోదు చేయాలన్నారు. దరఖాస్తుల పరిశీలనలో నిర్లక్ష్యం వహించరాదని, ప్రతి వివరాన్ని క్షుణ్ణంగా ధ్రువీకరించుకోవాలని ఆదేశించారు. పథకానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే ఉన్నతాధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని, నమోదు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్ నుంచి సీపీఓ గంగారెడ్డి, ఈడీఎం నదీం, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.