ఏటీఎంలో 32 లక్షలు చోరీ

07-10-2026 | 05:05am
  1. గ్యాస్ కట్టర్‌తో కోసి ఎత్తుకెళ్లిన దుండగులు
  2. సీసీ కెమెరాలకు కనిపించకుండా స్ప్రే
  3. శంషాబాద్‌లో ఘటన

రాజేంద్రనగర్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): శంషాబాద్‌లోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో(Axis Bank ATM) భారీ చోరీ జరిగింది. దుండగులు ఏటీఎం సీసీ కెమెరాలకు(CCTV cameras) కనిపించకుండా వాటిపై స్ప్రే కొట్టి, గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం యం త్రాన్ని కట్ చేసి అందులోని రూ.32 లక్షల నగదును అపహరించారు. ఈ ఘటన ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్(RGIA Police Station) పరిధిలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్‌గౌడ్ మాట్లాడుతూ.. దుండగులు పక్కా ప్రణాళికతో ఏటీఎం సెంటర్‌లో కి ప్రవేశించి, సీసీ కెమెరాలు కనిపించకుండా స్ప్రే చేసినట్లు తెలిపారు.

అనంతరం గ్యాస్ కట్టర్తో ఏటీఎంను కట్ చేసి నగదు అపహరించినట్లు పేర్కొన్నారు. నిందితులను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలిపారు. సోమవారం అర్ధరాత్రి ఏటీఎంలో చోరీ జరిగినట్లు రాత్రి 3 గంటల సమయంలో తమకు సమాచారం అందినట్టు యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ అనిల్ తెలిపారు. సుమారు రూ.32 లక్షల నగదు ఉండగా.. దుండగులు మొత్తం నగదును ఎత్తుకెళ్లినట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు