‘కఠిన’ అధికారిణి కటకటాల్లోకి...

07-10-2026 | 05:05am
  1. వెలుగులోకి వస్తున్న అవినీతి
  2. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డీఎంహెచ్‌ఓ 
  3. ప్రజావాణి నుంచి ఆగమేఘాల మీద కార్యాలయానికి రాక 
  4. సిన్సియర్ ముసుగు 
  5. పొలిటికల్ పైరవీలు 

రంగారెడ్డి బ్యూరో, అక్టోబర్ 6 (విజయక్రాంతి): ప్రజల ప్రాణాలను, ఆరోగ్య రక్షణను(Health Protection) పర్యవేక్షించాల్సిన జిల్లా వైద్యారోగ్య శాఖ ఆఫీసు(District Medical and Health Office) అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. ఆస్పత్రుల తనిఖీలు(Hospital inspections), అనుమతులు, బదిలీలు, ఆఖరికి కాంట్రాక్ట్ నియామకాల(Contract appointments) వరకు దేనినీ వదలకుండా వసూళ్ల దందా నడిపిన జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ స్వర్ణకుమారి(Swarnakumari) చివరకు ఏసీబీ వలకు చిక్కారు. రూ. లక్ష లంచం తీసుకుంటూ డ్రైవర్, హెల్త్ ఇన్స్పెక్టర్తో సహా ఆమె రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడం జిల్లావ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.

ఏసీబీ పక్కా స్కెచ్

ఎల్బీనగర్లోని ఓ సీజ్ చేసిన ప్రైవేటు ఫిజియోథెరపీ సెంటర్ను(A private physiotherapy center) ఎలాంటి లైసెన్స్ లేకుండా మళ్లీ నడిపించుకునేందుకు అనుమతి ఇచ్చేందుకు డీఎంహెచ్‌ఓ స్వర్ణకుమారి రూ. 2 లక్షలు డిమాండ్ చేశారు. చివరకు రూ. లక్షకు ఒప్పందం కుదిరింది. బాధితులు వెంటనే ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, ప్రైవేటు డ్రైవర్ ద్వారా రూ. లక్ష లంచం తీసుకుంటుండగా స్వర్ణకుమారి, హెల్త్ ఇన్స్పెక్టర్ ఎం. శ్రీనివాస్, డ్రైవర్ కృష్టయ్యలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరచడంతో పాటు ఆమె నివాసం, శివరాంపల్లిలోని ఆఫీసుల్లో సోదాలు చేసి కీలక ఫైళ్లు, నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

‘సిన్సియర్’ ముసుగు: గత ఆరు నెలల క్రితం వికారాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లాకు బదిలీపై వచ్చిన స్వర్ణకుమారి, రాగానే సిబ్బందిపై కఠినంగా వ్యవహరిస్తూ క్రమశిక్షణ గల అధికారిగా రంగు పూసుకునే ప్రయత్నం చేశారు. అయితే, ఆ ’కఠినత్వం’ అంతా వెనుక తెరపై అక్రమ వసూళ్లు జరిపేందుకేనని తదనంతర పరిణామాలు నిరూపించాయి.

వైద్యుల నిర్లక్ష్యంపై సెటిల్మెంట్లు: ఇబ్రహీంపట్నం, షాద్నగర్, ఎల్బీనగర్, మహేశ్వరం ప్రాంతాల్లో వైద్య లోపం వల్ల రోగులు ప్రాణాలు కోల్పోతే, దవాఖానాల యాజమాన్యాలకు షోకాజ్ నోటీసుల పేరుతో బెదిరింపులకు దిగి తెరవెనుక లక్షల్లో వసూలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

నిందితులకు వత్తాసు:  తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ దవాఖానా వసతి గృహం లో నర్సుపై అత్యాచారం, హత్య  ఘటనలో యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోగా, ‘ఉద్యోగానికి వెళ్లేటప్పుడు మనమే జాగ్రత్తగా ఉండాలి‘ అంటూ మీడియా ముందే యాజమాన్యానికి మద్దతుగా మాట్లాడటం తీవ్ర వివాదాస్పదమైంది.

ఫెర్టిలిటీ సెంటర్ల దోపిడీకి మద్దతు: నామమాత్రపు తనిఖీలతో సరిపెట్టి, సంతానం లేని దంపతుల నుంచి అడ్డగోలుగా డబ్బులు గుంజే ప్రైవేట్ ఫెర్టిలిటీ సెంటర్లకు పూర్తి సహకారం అందించారనే ఆరోపణలు ఉన్నాయి. వైద్య సిబ్బంది సాధారణ బదిలీలు, నియామకాల్లో ముడుపుల బాగోతం ఆరోపణ ఉన్నాయి.వైద్యారోగ్య శాఖలో ఏ పని జరగాలన్నా రేట్ ఫిక్స్ చేసి దందా నడిపినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పొలిటికల్ పైరవీలు: రాజకీయ సిఫార్సులతో రంగారెడ్డి జిల్లాకు వచ్చిన స్వర్ణకుమారి, కొద్ది రోజులకే ఆఫీసు సిబ్బందితో విభేదాలు తెచ్చుకున్నారు. సిబ్బంది ఏకంగా వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ఫిర్యాదు చేసి సహాయ నిరాకరణ చేపట్టగా, అప్పట్లో జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. విచారణ కమిటీ కూడా ‘ఈమె సిన్సియర్ అధికారి‘ అని రిపోర్టు ఇవ్వడంతో ఆమె ఆగడాలకు సరిహద్దు లేకుండా పోయింది. చివరకు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడంతో జిల్లా వైద్యారోగ్య శాఖలో నడుస్తున్న భారీ అవినీతి భాగోతం పూర్తిగా బట్టబయలైంది.

మరిన్ని వార్తలు