డబుల్ ‘దందా..!’

15-10-2026 | 05:25am
  1. అంగడి సరుకుగా  పేదల ఇండ్లు
  2. లక్షలు చెల్లిస్తేనే ఇళ్ల కేటాయింపులు 
  3.  దళారుల చేతుల్లో హర్రాజ్
  4. మన్సూరాబాద్ ‘ఎరుకల నాంచారమ్మ నగర్’లో ఊపందుకున్న అక్రమాలు
  5. అనర్హులు, స్థానికేతరులకే పీటముడి 
  6.  ప్రశ్నిస్తే దబాయింపులు,  బెదిరింపులు
  7. ఫిర్యాదులు చేసినా పట్టించుకోని హౌసింగ్ పీడీ 

ఎల్బీనగర్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): ఎల్బీనగర్ నియోజకవర్గంలోని(LB Nagar Constituency) మన్సూరాబాద్ ’ఎరుకల నాంచారమ్మ నగర్’లో పేద లకు ఉద్దేశించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు(Double-bedroom houses) దళారుల చేతుల్లో అంగడి సరుకుగా మారాయి. పారదర్శకంగా జరగాల్సిన ఇండ్ల కేటాయింపు ప్రక్రియను కొందరు దళారులు వేలం పాట (హర్రాజ్ పాట)గా మార్చి, ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారికే కేటాయిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు.

రూ. 1.5 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు వసూళ్లు !

మన్సూరాబాద్‌లో 1.34 ఎకరాల విస్తీర్ణం లో 288 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను రెండు బ్లాకులుగా నిర్మించారు. అయితే, బి-బ్లాక్‌లోని ఖాళీగా ఉన్న 84 ప్లాట్లను ఆసరాగా చేసుకుని ఆలిండియా ఎరుకల హక్కుల పోరాట సమితి(All India Erukala Rights Struggle Committee) నాయకుడిగా చెప్పుకుంటున్న ఒక వ్యక్తి, మరొక స్థానిక దళారితో కలిసి బహిరంగంగా దందా నడుపుతున్నట్లు ఆరోపణ లు వస్తున్నాయి. ఇల్లు ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ. 1.50 లక్షల నుండి రూ. 3 లక్షల వరకు దండుకుంటున్నారు. సగం డబ్బులు ఇచ్చిన వారిని మిగతా సొమ్ము కోసం వేధింపులకు గురిచేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

స్థానికేతరులకు పట్టాలు..

గత 20 ఏళ్లుగా ఇక్కడే నివాసముంటున్న అర్హులైన స్థానిక పేదలకు ఇండ్లు దక్కకపోగా, నల్గొండ, నిజామాబాద్ జిల్లాలతో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, ఒంగోలు ప్రాంతాలకు చెందిన అనర్హులకు పట్టాలు మంజూరు కావడం గమనార్హం. ‘మీరు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి పట్టాలు రాలేదు, ఇచ్చిన వారికి వచ్చాయి‘ అని దళారులు బహిరంగంగాదబాయిస్తుండటంతో స్థానికులు తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఇల్లు రాలేదన్న మనస్తాపంతో ఇటీవల ఒక మహిళ ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టగా స్థానికులు అడ్డుకున్నారు. మరొకవైపు, పొందిన ఇండ్లను కొందరు రూ. 15 నుంచి రూ. 20 లక్షలకు విక్రయించుకుంటున్నారనే ప్రచారం నడుస్తోంది.

హౌసింగ్ పీడీపై తీవ్ర ఆరోపణలు..

ఈ భారీ అక్రమాల్లో హౌసింగ్ పీడీ చంప్లానాయక్ పాత్రపై పలు అనుమానాలువ్యక్తమవుతున్నాయి. రెవెన్యూ అధికారుల జోక్యం లేకుండా పీడీయే అంతా తానై వ్యవహరిస్తూ, దాసరి గంగాధర్ అనే దళారీకి కొమ్ముకాస్తున్నారని ఎరుకుల సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. గతంలో ప్రజావాణి ద్వారా కలెక్టరేట్‌కు ఫిర్యాదులు వెళ్లడంతో అధికారులు విచారణ చేపట్టినప్పటికీ, ఇంతవరకు ఎవరిపైనా చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అర్హులైన పేదలకు న్యాయం జరిగేలా, అక్రమంగా పట్టాలు పొందిన అనర్హుల కేటాయింపులను రద్దు చేసి, దళారులు మరియు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు, ఎరుకల సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

అర్హుల పొట్టగొట్టి అనర్హులకు ఇస్తున్నారు..

ఆలిండియా ఎరుకల హక్కుల పోరాట సమితి ఉపాధ్యక్షుడినని చెప్పుకుంటూ ఒక వ్యక్తి పేదల నుంచి రూ. 3 లక్షల వరకు వసూలు చేస్తున్నాడు. అర్హులకు వచ్చిన ఇండ్లకు కూడా డబ్బుల కోసం వేధిస్తున్నాడు. దీనిపై తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల్లో ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

  వనం గంగయ్య, స్థానికుడు

మరిన్ని వార్తలు