ఇవేం చెత్త చెల్లింపులు?

10-11-2026 | 05:30am
  1. చెత్తను ప్రాసెస్ చేయకుండానే రాంకీకి రూ. 313.20 కోట్లు
  2. అప్పనంగా అందజేసిన జీహెచ్‌ఎంసీ
  3. 2025లోనే బయటపెట్టిన కాగ్ 
  4. 2012 నుంచి 2020 మధ్య జరిగిన చెల్లింపులు 
  5. ఇప్పటికీ రికవరీ చేయని రాష్ట్ర సర్కార్

హైదరాబాద్, నవంబర్ 9 (విజయక్రాంతి): ఓ వైపు పేరుకుపోతున్న చెత్త గుట్టలతో జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్(Jawaharnagar Dumping Yard) పరిసరాల్లోని జనం నరకయాతన అనుభవిస్తుంటే.. మరోవైపు ఆ చెత్త పేరుతో రాంకీ సంస్థ అప్పనంగా డబ్బులు దండుకుంటున్నది. చెత్తను ప్రాసెస్ చేయకుండానే ఏకంగా రూ. 313.20 కోట్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) నుంచి తీసుకుంది. ఈ విషయాన్ని సాక్షాత్తు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) 2025 నివేదికలో బయటపెట్టింది.

2012 నుంచి 2020 మధ్య కాలంలో ఈ మొత్తాన్ని జీహెచ్‌ఎంసీ చెల్లించినట్లుగా గుర్తించింది. ఇంతలా జనం సొమ్మును ఎలా చెల్లించారంటూ జీహెచ్‌ఎంసీని కాగ్ కడిగిపారేసింది. భారీ మొత్తంలో అక్రమంగా చెల్లింపులు జరిగినా.. దీనిపై ఇప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఆ డబ్బులను సంస్థ నుంచి రికవరీ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర సర్కార్‌పై ఉందని, డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల ఇబ్బందులు పడుతున్నవారికి ఆ సొమ్ముతో సౌకర్యాలు కల్పించవచ్చని జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ అంటున్నది. 

పొంతనలేని సమాధానాలు!

జీహెచ్‌ఎంసీతో ఘన వ్యర్థాల నిర్వహణకు ఒప్పందం కుదుర్చుకున్న రాంకీ సంస్థ 18 ఫిబ్రవరి 2012 నుంచి 31 జూలై 2020 నాటికి 44.16 లక్షల టన్నుల పొడి చెత్తను ప్రాసెస్ చేయకుండానే రూ. 313.20 కోట్ల మొత్తాన్ని అందుకుందని కాగ్ గుర్తించింది. వాస్తవానికి 2020 ఆగస్టులో చెత్త నుంచి విద్యుత్తు (వేస్ట్ టు ఎనర్జీ) ప్లాంట్‌ను జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌లో ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ ను పొడి చెత్త నుంచి వచ్చే వ్యర్థాలను ఉపయోగించి నడిపిస్తారు.

మరి ప్లాంట్ 2020 ఆగస్టులో ప్రారంభిస్తే.. 2012 ఫిబ్రవరి 18 నుంచి 2020 జూలై వరకు వచ్చిన పొడి చెత్తను ఎలా ప్రాసెస్ చేశారని కాగ్ అడిగిన ప్రశ్నలకు పొంతనలేని విధంగా జీహెచ్‌ఎంసీ 2023 మేలో సమాధానాలిచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు అప్పుడున్న పరిస్థితుల్లో ట్రీట్‌మెంట్ అండ్ డిస్పోజల్ (టీ అండ్ డీ) ప్రక్రియను చేపట్టినట్టు జీహెచ్‌ఎంసీ వివరణ ఇచ్చింది. అలాగే.. తడి చెత్తను లాచెట్ ట్రీట్‌మెంట్ చేసి కంపోస్ట్ ఎరువుగా మార్చే ప్రక్రియను చేపట్టినట్టు.. పొడి చెత్తను సిమెంట్ పరిశ్రమలకు, రీసైక్లింగ్ ఇండస్ట్రీకి వీలైనంత తరలించినట్టుగా పేర్కొంది. మిగిలిన పొడి చెత్తను అలాగే నిల్వచేసి చెత్త నుంచి విద్యుత్తు ప్లాంట్ కోసం ఉంచినట్టుగా జీహెచ్‌ఎంసీ పేర్కొంది.

దీనిపై కాగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. అలాగే ప్రభుత్వం నుంచి కూడా (సెప్టెంబర్ 2023లో) వచ్చిన సమాధానంపైనా కాగ్ అసంతృప్తిని వ్యక్తం చేసింది. మొత్తానికి పొడి చెత్తను ట్రీట్‌మెంట్ అండ్ డిస్పోజల్ చేయకుండానే రూ. 313.20 కోట్ల మొత్తాన్ని సదరు సంస్థకు చెల్లించడం ద్వారా ప్రజాధనాన్ని వృథా చేసినట్టుగా, సదరు సంస్థకు అప్పనంగా లాభం కలిగించినట్టుగా కాగ్ తప్పుబట్టింది. అలాగే జీహెచ్‌ఎంసీ, రాంకీ సంస్థ మధ్యలో కుదుర్చుకున్న ఒప్పందంలో పేర్కొన్న కొన్ని నిబంధనలను సైతం ఉల్లంఘించినట్టుగా గుర్తించింది. 

సర్కారు గప్ చుప్

భారీ మొత్తంలో అప్పనంగా రాంకీ సంస్థకు జీహెచ్‌ఎంసీ చెల్లించినప్పటికీ.. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. ఒకవైపు జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌లో రాంకీ సంస్థ సరిగ్గా వ్యర్థాలను ప్రాసెస్ చేయకపోవడం వల్ల తాము రోగాల బారిన పడుతున్నామని, యార్డ్‌ను తరలించాలని స్థానికులు ఉద్యమిస్తున్నారు. జల, వాయు, నేల కాలుష్యంతో చుట్టుపక్కల గ్రామాల్లోని సుమారు 40 లక్షల మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు అంటున్నారు.

మరోవైపు చెత్తను ప్రాసెస్ చేయకుండానే రాంకీ సంస్థకు జీహెచ్‌ఎంసీ ఏకంగా రూ. 313.20 కోట్లు చెల్లించడం, ఆ మొత్తాన్ని ఇప్పటివరకు ప్రభుత్వం రికవరీ చేయకపోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. రాంకీ నిర్వాకం వల్ల తమ జీవితాలు బలవుతున్నాయని, అలాంటి సంస్థకు అప్పనంగా అన్ని కోట్ల చెల్లింపుల వ్యవహారంపై ఇప్పటికీ తేల్చకపోవడం ఏమిటని స్థానికులు నిలదీస్తున్నారు. 

ప్రజాధనం వృథా

ఒకవైపు డంపింగ్ యార్డ్ వల్ల ప్రజల ప్రాణాలు సమిధలుగా మారుతున్నాయి. స్థానికులు అనేక రోగాల బారిన పడుతున్నారు. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. మరోవైపు ప్రజా ధనం అప్పనంగా ఘన వ్యర్థాల నిర్వహణ సంస్థకు అప్పజెప్పుతున్నారు. రూ. 313.20 కోట్ల మొత్తాన్ని చెత్త ప్రాసెస్  చేయకుండానే ఇచ్చినట్టుగా కాగ్ గుర్తించినప్పటికీ.. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం ఏమిటి? దీని వల్ల సంస్థకు, ప్రభుత్వానికి మధ్య ఏదైనా లోపాయికారి ఒప్పందం ఉందా.. అనే అనుమానాలు రాకమానవు. అప్పనంగా చెల్లించిన మొత్తాన్ని సంస్థ నుంచి రికవరీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆ మొత్తంతో.. జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అనేక సౌకర్యాలు కల్పించవచ్చు.

 గడ్డం సదానందం, కోకన్వీనర్, 

జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ

ప్రభుత్వం మౌనమెందుకు?

ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అయితే జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ విషయంలో మాత్రం ప్రభుత్వం ప్రజల పక్షాన ఉండటం లేదనే అనుమానాలు వస్తున్నాయి. ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా.. ప్రజల పక్షం నిలవాలి. కానీ, ఇక్కడ జీహెచ్‌ఎంసీ అప్పనంగా రూ. 313.20 కోట్లను వ్యర్థాల నిర్వహణ కోసం రాంకీ సంస్థకు ఇవ్వడం.. అసలు పొడి చెత్తను ప్రాసెస్ చేయకుండానే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్టుగా కాగ్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ తేల్చిచెప్పినప్పటికీ.. ప్రభుత్వం మౌనంగా ఉండటం సరైంది కాదు. ఇప్పటికైనా ఆ మొత్తాన్ని సంస్థ నుంచి వసూలు చేసి.. ఇక్కడి ప్రజల ఇబ్బందులను పరిష్కరించేందుకు ఉపయోగించాలి.

మారం సమ్మిరెడ్డి, 

కో కన్వీనర్, దమ్మాయిగూడ జేఏసీ

కాగ్ ఏం చెప్పింది?

రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థ(యూఎల్‌బీ)ల్లో ఘన వ్యర్థాల నిర్వహణ ఎలా ఉంది, చెత్త ప్రాసెస్ ఎలా చేస్తున్నారు, అందుకోసం నిధులను ఎలా ఖర్చు చేస్తున్నారు.. అనే అంశాలపై కాగ్ ఆడిట్ నిర్వహించింది. 2023 మార్చితో ముగిసిన కాలానికి సంబంధించి ఆడిట్ చేసింది. ఇందులో భాగంగా 18 ఫిబ్రవరి 2012 నుంచి 28 ఫిబ్రవరి 2015 వరకు.. అలాగే 1 మార్చి 2015 నుంచి 14 జూలై 2020 వరకు జీహెచ్‌ఎంసీ వరుసగా రూ. 178.26 కోట్లు, రూ. 662.05 కోట్ల మొత్తాన్ని చెత్త ట్రీట్‌మెంట్ అండ్ డిస్పోజల్ (టీ అండ్ డీ) కోసం కాంట్రాక్టు సంస్థ (రాంకీ ఎన్విరో ఇంజనీర్స్)కు చెల్లించినట్టుగా కాగ్ గుర్తించింది. దీన్ని 2025లో విడుదల చేసిన ఆడిట్ నివేదిక (1)లో స్పష్టంగా వివరించింది.

నిజానికి ఒప్పందం ప్రకారం.. సదరు సంస్థ ప్రతి రోజూ వస్తున్న చెత్త నుంచి తడి, పొడి చెత్తను వేరుచేసి తడి చెత్తను లాచెట్ ట్రీట్‌మెంట్‌చేసి కంపోస్ట్‌గా మార్చే ప్రక్రియను అమలు చేయాలి. అలాగే పొడి చెత్తను కూడా టీ అండ్ డీలో భాగంగా డబ్ల్యూటీఈ (వేస్ట్ టు ఎనర్జీ)గా మార్చాల్సి ఉంది. అయితే రాంకీ సంస్థ పొడి చెత్తను ఎలాంటి ప్రాసెస్ చేయకుండానే 2012 నుంచి 20202 మధ్య సుమారు రూ. 313.20 కోట్ల మొత్తాన్ని  జీహెచ్‌ఎంసీ నుంచి అందుకున్నట్లు కాగ్ తన నివేదికలో ప్రస్తావించింది. 

మరిన్ని వార్తలు