మెగా క్లైమేట్ కాంక్లేవ్

10-11-2026 | 05:10am
  1. హైదరాబాద్‌లో డిసెంబర్ 7 నుంచి రెండు రోజులపాటు
  2. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా నిర్వహణ
  3. హాజరుకానున్న జాతీయ, అంతర్జాతీయ పర్యావరణవేత్తలు
  4. హాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులకూ ఆహ్వానం
  5. ఎల్ నినో సన్నద్ధత, హరిత పెట్టుబడులపై ప్రత్యేక దృష్టి 
  6. సమీక్షా సమావేశంలో మంత్రి ఉత్తమ్ వెల్లడి

హైదరాబాద్, నవంబర్ 9 (విజయక్రాంతి):  డిసెంబర్ 7 నుంచి హైదరాబాద్‌లో అంతర్జాతీయ వాతావరణ సదస్స (International Climate Conclave) నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నదని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026’లో భాగంగా ఈ సదస్సు నిర్వహించనున్నామని, ఇందులో పలువురు జాతీయ, అంతర్జాతీయ పర్యావరణ వేత్తలతోపాటు పర్యావరణ పరిరక్షణలో చురుకుగా ఉన్న హాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులను ఆహ్వానించాలని ప్రభుత్వం భావిస్తున్నదని ఆయన తెలిపారు.

ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనే సన్నద్ధత, వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యాన్ని పెంచడం, హరిత పెట్టుబడులు ఈ సదస్సులో ప్రధాన అంశాలుగా ఉంటాయని పేర్కొన్నారు. సదస్సు ఏర్పాట్లపై సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్షించారు.  ఎల్ నినో ప్రభావంతో వర్షాభావం దీర్ఘకాలం కొనసాగడం, నీటి కొరత, అధిక ఉష్ణోగ్రతలు, సాగుకు ఇబ్బందులు వంటి పరిణామాలపై ముందుగానే సిద్ధం కావాలని మంత్రి సూచించారు.

వేసవి తీవ్రంగా ఉండే నెలల్లో కరువు ప్రభావాన్ని తగ్గించేందుకు, సహాయక చర్యలు చేపట్టేందుకు నెలకు దాదాపు రూ.1,000 కోట్లు సమీకరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని ఆయన గుర్తుచేశారు. వేసవిలో కీలకమైన మార్చి నుంచి మే వరకు తాగునీరు, పశుగ్రాసం అందుబాటులో ఉంచడం, కరువు ప్రభావానికి ఎక్కువగా గురయ్యే వర్గాలను ఆదుకోవడం వంటి అంశాలపై సదస్సులో చర్చకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. రెండురోజుల పాటు ఈ కాంక్లేవ్ జరిగే అవకాశం ఉంది. 

ప్రముఖులకు ఆహ్వానం

పర్యావరణ పరిరక్షణలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రముఖులను ఎంపిక చేసి.. సంబంధిత సంస్థలు, దౌత్య మార్గాల ద్వారా సదస్సుకు వారిని ఆహ్వానించాలని అధికారులకు మంత్రి ఉత్తమ్ సూచించారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న రాజేంద్ర సింగ్, సునీతా నారాయణ్, సద్గురు, నార్వే పర్యావరణ శాఖ మాజీ మంత్రి ఎరిక్ సోల్హైమ్ తదితరులు ప్రతిపాదిత ఆహ్వానితుల్లో ఉన్నారు. పర్యావరణ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న సినీనటి దియా మీర్జాను సదస్సు పరిచయ కార్యక్రమానికి ఆహ్వానించే అవకాశాన్ని పరిశీలించాలని అధికారులకు మంత్రి ఉత్తమ్ సూచించారు. కేంద్ర మంత్రులు, దేశీయ రాజకీయ, పర్యావరణ రంగాల ప్రముఖులతో పాటు నార్వే, డెన్మార్క్, స్వీడన్ తదితర దేశాల రాయబారులను ఆహ్వానించే ప్రతిపాదన ఉంది. 

హరిత పెట్టుబడులపై ప్రత్యేక చర్చ

వాతావరణ సమస్యలకు పరిష్కారాలను అందించే వ్యాపారాలు, పెట్టుబడి అవకాశాలపై సదస్సులో ప్రత్యేకంగా చర్చించాలని మంత్రి ఉత్తమ్ తెలిపారు. వాయు కాలుష్య నియంత్రణ, పునరుత్పాదక ఇంధనం, వాతావరణ చర్యలకు నిధుల సమీకరణ, జల సంరక్షణ, హరిత సాంకేతికతలు, సుస్థిర మౌలిక వసతులు, వ్యర్థాల నుంచి సంపద సృష్టి వంటి అంశాలను ఈ చర్చల్లో భాగం చేయాలన్నారు. భూగర్భజలాల పెంపు, క్షీణించిన భూముల పునరుద్ధరణ, సూక్ష్మసేద్యం, నేల సంరక్షణ, తక్కువ నీటితో ఉద్యాన పంటల సాగులో విజయవంతమైన నమూనాలను సదస్సులో ప్రదర్శించాలని ఆయన సూచించారు. మణికొండలో ఓ నివాస సముదాయం చేపట్టిన భూగర్భజలాల పెంపు (గ్రౌండ్‌వాటర్ రీచార్జ్) కార్యక్రమాన్ని, కాన్హా శాంతివనంలో చేపట్టిన మొక్కల పెంపకం, నేల సంరక్షణ పనులను ఉదాహరణలుగా ప్రస్తావించారు. 

నవంబర్ 28న క్షేత్రస్థాయి సంప్రదింపులు

వాతావరణ మార్పులతో నేరుగా ప్రభావితమవుతున్న ప్రజల అనుభవాలు, అవసరాలు సదస్సు చర్చల్లో ప్రతిబింబించేలా నవంబర్ 28న క్షేత్రస్థాయి సంప్రదింపుల సమావేశం నిర్వహించాలని, వివిధ వర్గాలకు చెందిన సుమారు 100 మంది ప్రతినిధులను ఈ సమావేశానికి ఆహ్వానించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రతిపాదించారు. అంతర్జాతీయ వాతావరణ సదస్సును రెండు రోజులపాటు నిర్వహించి, పరిమిత సంఖ్యలో సమావేశాలతో ప్రధాన అంశాలపై లోతైన చర్చకు అవకాశం కల్పించాలని ఆయన సూచించారు. కాగా,  సమీక్ష సమావేశంలో పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, అటవీ శాఖ ప్రధాన సంరక్షణాధికారి వినయ్‌కుమార్, టీజీ ట్రాన్స్‌కో మేనేజింగ్ డైరెక్టర్ డీ కృష్ణభాస్కర్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు