పొడుగు బియ్యం ఎటుపాయే!?
- రైస్ మిల్లర్ల గుండెలో గుదిబండ
- సీబీ సీఐడీ విచారణతో గుబులు
- తప్పించుకునేందుకు విశ్వప్రయత్నాలు
మహబూబాబాద్, నవంబర్ 9 (విజయక్రాంతి): భారత ఆహార సంస్థ బియ్యం సేకర ణలో ఉన్న ‘పొడుగు, పొట్టి బియ్యం’ అనే చిన్న లొసుగును ఆధారంగా చేసుకుని సన్నధాన్యం అమ్ముకొని అందుకు బదులు గా ఆంధ్ర ప్రాంతం నుంచి 1010 పొడుగు రకం బియ్యం తెప్పించి భారత ఆహార సంస్థ కు సివిల్ సప్లై ద్వారా సీఎంఆర్ కోటా పెట్టిన కొంతమంది రైస్ మిల్లర్ల(Telangana Rice Millers)కు ఇప్పుడు అది గుదిబండగా మారింది. నిబంధనల ప్రకా రం సన్న(పొట్టి)రకం ధాన్యాన్ని మిల్లు పట్టించి బియ్యం సీఎంఆర్ కోటా కింద పెట్టాల్సిన కొందరు మిల్లర్లు పొడుగు రకం బియ్యం పెట్టి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సన్న రకం ధాన్యానికి చెల్లించిన రూ.500లు బోనస్ దిగమింగినట్లు గుర్తించిన ప్రభుత్వం సీబీ సీఐడీ విచారణకు ఆదేశించింది.
ఈ క్రమంలో నిజామాబాద్, కరీంనగర్, ములుగు జిల్లాకు చెందిన కొందరు రైసు మిల్లర్లు ఎఫ్సీఐకి పొడుగు రకం బియ్యం పెట్టినట్లు గుర్తించి పలువురు మిల్లర్లను సీబీ సీఐడీ అధికారులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఇదే విధానాన్ని ఇతర జిల్లాల్లో కొందరు రైస్ మిల్లర్లు అవలంబించినట్లు అనుమానిస్తున్న సీబీ సీఐడీ అధికారులు ఆయా జిల్లాల వా రీగా రైతుల నుంచి కొనుగోలు చే సిన సన్న, దొడ్డు రకం దాన్యం మిల్లర్లకు కేటాయించిన కోటా ఎంత, తిరిగి రైస్ మిల్లర్లు గతేడాది యాసంగి సీజన్లో ఎఫ్సీఐకి పెట్టిన బియ్యం కోటా వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం.
ఒక్కో లారీకి లక్ష రూపాయల లాభం?
పొట్టి రకం బియ్యం బదులు పొడుగు రకం బియ్యం పెట్టడం వల్ల మిల్లర్లకు ఒక్కో లారీకి లక్ష రూపాయలు గిట్టుబాటు అయినట్లు ప్రచారం సాగుతోంది. ఒక్కో లారీ (ఏ సీ కే) లో 290 క్వింటాళ్ల ధాన్యాన్ని మిల్లర్లకు సీఎంఆర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయిం చి, అందుకు బదులుగా క్వింటాలకు 67 కిలోల చొప్పున బియ్యం ఇవ్వాలని టార్గెట్ ఇచ్చింది.
అయితే కొందరు మిల్లర్లు ప్రభు త్వం ఇచ్చిన ధాన్యాన్ని అప్పట్లో లారీకి 290 క్వింటాళ్లు చొప్పున, క్వింటాలుకు 3 వేల రూపాయల చొప్పున ఆంధ్ర ప్రాంతానికి వి క్రయించుకున్నారని, అలా ధాన్యాన్ని 8.70 లక్షల రూపాయల నగదు చేసుకొని, ఆ తర్వాత ఆంధ్ర ప్రాంతం నుంచి పొడుగు రకం (1010) బియ్యాన్ని క్వింటాలుకు 3,850 రూపాయల చొప్పున కొనుగోలు చేసి దిగుమతి చేసుకొని పాసిం గ్ ఖర్చులు కలుపుకొని అది కూడా మిల్లు పట్టకుండా, ఎలాంటి కష్టం, నష్టం లే కుండా బియ్యం పెట్టడం వల్ల ఒక్కో లారీకి లక్ష రూపాయలకు పైగా లాభం గడించినట్లు ప్రచారం సాగుతోంది.
ఇలా అక్రమాలకు పాల్పడ్డ కొందరు రైస్ మిల్లర్ల మాయాజాలంపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సీబీ సీఐడీ విచారణకు ఆదేశించడంతో అక్రమార్కులైన కొందరు రైస్ మిల్లర్ల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని చెబుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో ఈ విధంగా లొసుగులను ఆధారంగా చేసుకుని పొట్టి రకం బియ్యానికి బదులు పొడుగు రకం బియ్యం పెట్టి లక్షలు గడించిన మిల్లర్ల వ్యవహారంపై విచారణ వేగవంతం చేయడంతో ఇప్పుడు పొడుగు రకం బియ్యం వ్యవహారం ఆ మిల్లర్లకు గుదిబండగా మారిందని చెబుతున్నారు. సీబీ సీఐడీ విచారణతో సదరు అక్రమ మార్గంలో పయనించిన మిల్లర్లకు ఇప్పుడు పొడుగు రకం బియ్యం వ్యవహారం గుబులు పుట్టిస్తోంది. మహబూబాబాద్ జిల్లాలో కూడా ఈ తరహాలో సుమారు 500 లారీల పొడుగు రకం బియ్యాన్ని 20 మందికి పైగా రైస్ మిల్లర్లు ఎఫ్సీఐకి పెట్టినట్లు ప్రచారం సాగుతోంది.
లోతుగా సీబీ సీఐడీ విచారణ!
పొట్టి రకం బియ్యానికి బదులు పొడుగు రకం బియ్యం పెట్టిన సంఘటనలపై సీబీ సీఐడీ అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారని, మిల్లర్లు భారత ఆహార సంస్థ గోదాముకు బియ్యం తరలించిన సమయంలో అక్కడ సాంకేతిక పరీక్షలు, బియ్యం శాంపిల్ కలెక్షన్, ఆ బియ్యం ఎక్కడికి తరలించారు. బెడ్ నంబర్, లాట్ నంబర్, గన్ని సంచులపై ఉండే లేబుళ్ల వివరాలను కూడా సేకరిస్తున్నట్టు సమాచారం.
ఎఫ్సీఐ గోదాముల్లో దిగుమతి అయిన బియ్యం వివరాలను ఆధునిక జపాన్ టెక్నాలజీతో సమకూర్చిన సీసీ కెమెరాలులో రికార్డ్ అయిన వివరాలను కూడా పరిశీలించేందుకు సీబీ సీఐడీ అధికారులు ఎఫ్సీఐ అనుమతి కోరినట్లు తెలుస్తోంది. మిల్లర్లు ఎఫ్సీఐకి బియ్యం పెట్టిన సమయంలో మిల్లు నడిపిన సంఘటనలకు సంబంధించిన కరెంటు బిల్లు, ఇతర వ్యవహారాలపై కూడా విచారణ సాగిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. సమగ్ర విచారణ తర్వాత పొట్టి రకం బియ్యానికి బదులు పొడుగు రకం బియ్యం పెట్టిన మిల్లర్ల వ్యవహారంపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.