అక్రమ బ్లాస్టింగ్ లు!
- అపార్ట్మెంట్లకు బీటలు
- బిక్కుబిక్కుమంటున్న పుప్పాలగూడ వాసులు
- నిబంధనలకు నీళ్లొదిలి, నిపుణుల పర్యవేక్షణ లేకుండానే రాత్రింబవళ్లు పేలుళ్లు
- భయాందోళనలో చిన్నారులు, వృద్ధులు
- మరోసారి బ్లాస్టింగ్ జరిగితే ప్రజా ఉద్యమం తప్పదని జితేందర్ మెరుగు హెచ్చరిక
మణికొండ, నవంబర్ 21 (విజయక్రాంతి): అభివృద్ధి ముసుగులో, అధికారుల పర్యవేక్షణ లోపంతో పుప్పాలగూడ ప్రాంతంలో చేపడుతున్న అక్రమ బ్లాస్టింగ్లు(Illegal Blasting) స్థానికుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. నిబంధ నలకు తూట్లు పొడుస్తూ, రాత్రి పగలు తేడా లేకుండా బిల్డర్లు చేస్తున్న భారీ పేలుళ్ల ధాటికి పక్కనే ఉన్న పలు నివాస సముదాయాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి.
గోడలకు ప గుళ్లు రావడమే కాకుండా, ఏ కంగా పునాదులకు సైతం బీట లు వారుతుండటంతో భవనాలు ఎప్పుడు కూలిపోతా యోనని నివాసితులు తీవ్ర భ యాందోళనకు గురవుతున్నారు. పుప్పాలగూడ రోడ్ నంబర్ 13లో లాన్స మ్ ప్రాజెకట్స్ నిర్మాణ పనుల్లో చేపడుతున్న భారీ బ్లాస్టింగ్ల వల్ల సమీపంలోని ట్విన్ డైమండ్స్, ఎస్ఎస్డీ వై3, కోనిఫర్స్ అపార్ట్మెంట్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో నెక్కనంపూర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు జితేందర్ మెరుగు బాధిత అపార్ట్మెంట్లను సందర్శించి, నివాసితులతో మాట్లాడి నష్ట తీవ్రతను స్వయంగా పరిశీలించారు.
అనంతరం నిర్మాణ సంస్థ ఎండీ, సీఐ విష్ణువర్ధన్ రెడ్డి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యను వివరించారు. ఇకపై భారీ బ్లాస్టింగ్ చేప ట్టబోమని సంస్థ ప్రతినిధులు హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. అయితే, గతం లోనూ ఇలాగే హామీలు ఇచ్చి బ్లాస్టింగ్ కొనసాగించారని నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. మరోసారి ఇలా ంటి ఘటనలు పునరావృతమైతే సహించేది లేదని, బాధితులకు న్యాయం జరిగే వరకు ప్రజా ఉద్యమం చేపడతామని జితేందర్ హెచ్చరించారు. ప్రజల ప్రాణాల భద్రత విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు.
నిబంధనలకు తూట్లు..
నిర్మాణ సమయంలో బండరాళ్లను తొలగించేందుకు బ్లాస్టింగ్ చేయాల్సి వస్తే కచ్చితమైన నిబంధనలు పాటించాలి. పేలుడు పదార్థాలు ఎంత మోతాదులో వాడాలి, ఏ సమయంలో పేలుళ్లు జరపాలి అనే అంశాలపై మైనింగ్, పోలీస్, ఫైర్ సేఫ్టీ అధికారుల నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాలి. కేవలం నిపుణుల ప్రత్యక్ష పర్యవేక్షణలో, పరిమిత స్థాయిలోనే కంట్రోల్ బ్లాస్టింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ, పుప్పాలగూడలోని పలు కొత్త హైరైజ్ బిల్డింగ్లు, గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణాల వద్ద గుత్తేదారులు, బిల్డర్లు ఈ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తమ పనులు త్వరగా పూర్తి చేసుకోవాలనే ఆత్రుతతో నిపుణులు లేకుండానే రాత్రింబవళ్లు ఇష్టానుసారంగా బాంబ్ బ్లాస్టింగ్లు చేపడుతున్నారు.
భయం గుప్పిట్లో చిన్నారులు, వృద్ధులు..
అకస్మాత్తుగా వచ్చే భారీ శబ్దాలు, భూకంపం వచ్చినట్లు కదులుతున్న భవనాలతో అపార్ట్మెంట్ వాసులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. వృద్ధులు, చిన్నారులు ఈ శబ్దాలకు తీవ్ర భయాందోళనలకు గురవుతూ అనారోగ్యం బారిన పడుతున్నారు. పక్కనే ఉన్న పక్కా అపార్ట్మెంట్ల పునాదులు సైతం కదిలిపోతుండటంతో భవిష్యత్తులో పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మైనింగ్, పోలీస్, మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి నిబంధనల విరుద్ధంగా జరుగుతున్న బ్లాస్టింగ్లను అడ్డుకోవాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.