గల్లీకో బెల్ట్ దందా..

21-11-2026 | 05:15am
  1. మామూళ్ల మత్తులో ఎక్సైజ్ నిఘా!
  2. పల్లెల్లో యథేచ్ఛగా అక్రమ మద్యం విక్రయాలు
  3. ఎమ్మార్పీకి మించి దోపిడీ.. మత్తులో చిత్తవుతున్న యువత
  4. ఆందోళనలో గ్రామీణ మహిళలు
  5. ఉన్నతాధికారులు స్పందించాలని డిమాండ్

ఇబ్రహీంపట్నం, నవంబర్ 20 (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లో అక్రమ మద్యం విక్రయాలు(Illegal Liquor Sales) జోరుగా సాగుతున్నా సంబంధిత ఎక్సైజ్ అధికారుల పర్యవేక్షణ కనిపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని గ్రామాల్లో గల్లీకో బెల్ట్ షాపు వెలుస్తుండటంతో మద్యం విక్రయాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. లైసెన్స్ కలిగిన మద్యం దుకాణాల నుంచి మద్యం తీసుకొచ్చి గ్రామాల్లోని చిన్న చిన్న కిరాణా కొట్లు, కూడళ్లు, ఇతర ప్రాం తాల్లో అక్రమంగా విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇంత బహిరంగంగా వ్యాపారం సాగుతున్నా ఎక్సైజ్ అధికారుల నిఘా ఎక్కడుందనే ప్రశ్నలు స్థానికుల నుం చి వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం అనుమతి పొందిన మద్యం దుకాణాల్లోనే విక్రయాలు జరగాల్సి ఉండగా, బెల్ట్ షాపుల్లో మాత్రం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు మద్యం అందుబా టులో ఉంటోంది. అంతేకాకుండా ఎమ్మార్పీ కంటే రూ.20 నుంచి రూ.50 వరకు అధిక ధరలకు విక్రయిస్తున్నారని, మైనర్లకు సైతం మ ద్యం అందిస్తున్నారనే ఆరోపణలు న్నాయి. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వలస కూలీలు అధికంగా నివసించే ప్రాం తాల్లో ఈ అక్రమ విక్రయాలు మరింత విచ్చలవిడిగా సాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

మందుబాబుల ఆగడాలు..

బెల్ట్‌షాపుల కారణంగా గ్రా మాల్లోమద్యం సేవించే వారి సంఖ్య పెరిగి సామాజిక సమస్యలు తలెత్తుతున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు, బస్టాండ్లు, పాఠశాలల పరిసరాల్లో మద్యం సేవించి కొందరు గొడవలకు దిగుతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కష్టపడి కూలీ పనులు చేసుకుని సంపాదించిన డబ్బును కుటుంబ అవసరాలకు ఖర్చు చేయాల్సింది పోయి మద్యానికే వెచ్చిస్తుండటంతో కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతు న్నాయని వాపోతున్నారు. చిన్న వయసులోనే యువత మద్యానికి అలవాటు పడు తుండటం ఆందోళన కలిగిస్తోంది.

కంచె చేను మేస్తోందా?.. ఎక్సైజ్ నిఘా ఎక్కడ?

గ్రామాల్లో బహిరంగంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ మద్యం విక్రయాలు సాగిస్తున్నా వాటిని నియంత్రించడంలో ఎక్సైజ్ శాఖ ఎందుకు విఫలమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమ విక్రయాలపై నిరంతర నిఘా పెట్టాల్సిన అధికారులు అప్పు డప్పుడు తనిఖీలకే పరిమితమవుతున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్సై జ్ అధికారులు మామూళ్లకు అలవాటు పడి, బెల్ట్ షాపుల నిర్వాహకులపై చర్యలు తీసుకోకుండా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఉక్కుపాదం మోపితేనే అడ్డుకట్ట..

బెల్ట్ షాపుల నిర్వహణ చట్టవిరుద్ధం కావడంతో అక్రమ మద్యం విక్రయాలపై దాడు లు నిర్వహించి, నిర్వాహకులపై చట్టప్రకారం కేసులు నమోదు చేయడంతోపాటు మద్యం స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ గ్రామాల్లో ఈ దందా కొనసాగు తుండటంపై ఉన్నతాధికారులు స్పందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎక్సైజ్, పోలీస్ శాఖలు సమన్వయంతో ప్రత్యేక తనిఖీలు చేపట్టి బెల్ట్‌షాపులకు అడ్డుకట్ట వేయా లని, గ్రామీణ మహిళలకు ప్రశాంతమైన వాతావరణం కల్పించాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు