పార్కులో ‘పరేషాన్’..!

15-10-2026 | 05:20am
  1. మంచిరేవుల అటవీ పార్కులో తప్పని తిప్పలు
  2. వాకింగ్ ట్రాకును కమ్మేసిన పిచ్చిమొక్కలు.. భయపెడుతున్న విషపురుగులు
  3. వీధి కుక్కల స్వైరవిహారం.. చిన్నారులు, వన్యప్రాణులకు పొంచి ఉన్న ముప్పు
  4. భారీగా ఫీజులు వసూలు చేస్తున్నా కనిపించని సౌకర్యాలు
  5. ఆందోళనలో మార్నింగ్ వాకర్స్, సందర్శకులు

రాజేంద్రనగర్, అక్టోబరు 14 (విజయక్రాంతి): ఆరోగ్యం, ఆహ్లాదం కోసం పార్కుకు వచ్చే ప్రజలకు సరికొత్త కష్టాలు వచ్చిపడ్డా యి. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు(Outer Ring Road) మంచిరేవుల గ్రామ(Manchirevula village) శివారులో ఉన్న ఫారెస్ట్ పార్కు నిర్వహణ అధ్వాన్నంగా మారడంతో మార్నింగ్ వాకర్స్(Morning walkers) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజూ ఉదయం  సుమారు 500 నుండి 600 మంది దాకా నడక ప్రియులు ఉదయాన్నే ఇక్కడికి వస్తుంటారు. అయితే, పార్కులో కనీస సౌకర్యాలు కరువవ్వడం, అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై విజిటర్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కుదించుకుపోయిన ట్రాక్.. పొంచి ఉన్న విషసర్పాల భయం..

పార్కులో ప్రధాన సమస్య వాకింగ్ ట్రాక్ నిర్వహణే. నడక దారికి ఇరువైపులా గడ్డి, పిచ్చి మొక్కలు అడవి లా పెరిగిపోయాయి. ట్రాక్ వెంబడి ఇద్దరు వ్యక్తులు పక్కపక్కన నడిస్తే.. మూడో వ్యక్తి వెళ్లడానికి వీల్లేనంతగా దారి కుదించుకుపోయింది. ఈ పిచ్చి మొక్కలను ఫారెస్ట్ సిబ్బంది సకాలంలో తొలగించకపోవడంతో, పొదల్లో నుంచి ఎప్పుడు ఏ విష పురుగు, పాము వస్తుందోనని వాకర్స్ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని నడుస్తున్నారు. చీకటి వేళల్లో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కుక్కల కాటు.. వన్యప్రాణులకు గండం

పార్కులో వీధి కుక్కల బెడద తీవ్ర రూ పం దాల్చింది. పదుల సంఖ్యలో కుక్కలు గుంపులుగా తిరుగుతూ మా ర్నింగ్ వాకర్స్పైకి వస్తున్నాయి. శని, ఆదివారాల్లో ఇక్కడికి దాదాపు 2,000 మందికి పైగా సందర్శకులు, చిన్నారులతో కలిసి వస్తుంటారు. కుక్కల స్త్వ్రరవిహారంతో పిల్లలను వెంటబెట్టుకుని రావాలంటేనే తల్లిదండ్రులు వణికిపోతున్నా రు. అంతేకాకుండా, పార్కులో ఉండే జింక లు, ఇతర అటవీ ప్రాణులకు కూడా ఈ కుక్కల వల్ల ప్రాణసంకటం ఏర్పడింది. తక్షణమే మున్సిపల్, అటవీ శాఖ అధికారులు స్పందించి కుక్కలను పట్టి వేరే ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.

పార్కులో అటవీ శాఖ వసూలు చేస్తున్న ఫీజులు సామాన్యులకు భారంగా మారాయి..

వార్షిక రుసుము (వ్యక్తిగతంగా): రూ. 2,800

దంపతులకు (కలిపి):  రూ. 4,000

సీనియర్ సిటిజన్‌కు:  రూ. 1,800

రోజువారీ ప్రవేశ రుసుము:  రూ. 50

ఇంత భారీ మొత్తంలో చార్జీలు వసూలు చేస్తున్నప్పటికీ, అందుకు తగ్గట్టుగా వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని సందర్శకులు మండిపడుతున్నారు. కనీసం నడక దారిని కూడా శుభ్రం చేయకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తాగేందుకు స్వచ్ఛమైన నీరు, మెరుగైన శానిటేషన్, తగినంత లైటింగ్ సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.

గడ్డిని త్వరలోనే తొలగిస్తాం..

మంచిరేవుల ఫారెస్ట్ పార్కు సమస్యలపై అటవీ శ్రేణాధికారి (లక్ష్మణ్ స్పందించారు. వాకింగ్ ట్రాక్కు ఇరువైపులా అడ్డంగా పెరిగిన గడ్డి, పిచ్చి మొక్కలను వెంటనే తొలగిస్తామని హామీ ఇచ్చారు. వాకర్స్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా, నడక సాగించడానికి అనువుగా ట్రాక్ను త్వరలోనే సిద్ధం చేస్తామని, పార్కులో భద్రతా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

 లక్ష్మణ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్

మరిన్ని వార్తలు