సబ్సిడీ విత్తనాలు రావాయె!

18-11-2026 | 05:50am

ఎల్ నినో ఎఫెక్ట్‌తో ఆరుతడి పంటలు వేయాలన్న ప్రభుత్వం

50 నుంచి 75 శాతం సబ్సిడీపై విత్తనాలు ఇస్తామని హామీ

సీజన్ ప్రారంభమైనా రైతులకు అందని విత్తనాలు 

నవంబర్ 17 (విజయక్రాంతి): యాసంగిలో ఆరుతడి పంటలు(Semi-dry crops) వేయండి.. సబ్సిడీపై విత్తనాలు(Seeds) ఇస్తామని ప్రభుత్వం చెప్తున్నా అది ఇప్పటికీ కార్యరూపం దాల్చడం లేదు. రాష్ట్రంలో యాసంగి పంటల సీజన్(Rabi crop season) ప్రారంభమైనా సబ్సిడీ విత్తనాలు(Subsidized seeds) అందడం లేదు. కొన్ని జిల్లాల్లో కొద్దిగా నీళ్లు ఉన్న చోటు.. వరి నారుమళ్లను రైతులు సిద్ధం చేసుకున్నారు.

నీళ్లు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలను నాటేందుకు సిద్ధ మైనప్పటికీ ఇంకా సబ్సిడీ విత్తనాలు(Subsidized seeds) అందుబాటులో రాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాసింగి సీజన్ ప్రారంభమైనా.. ఇంకా రైతులకు కావాల్సిన విత్తనాలకు సంబంధించిన డేటా సేకరణ(Data Collection) పనిలోనే అధికారులు నిమగ్నమయ్యారు. ప్రభుత్వం అందించే సబ్సిడీ విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో.. రైతులు(Farmers) ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించి, ఎక్కువ రేటుకు కొనుగోలు చేయాల్సి వస్తున్నది. 

చెప్పడంతోనే సరిపోతుందా? 

ఎల్ నినో(El Niño) కారణంగా యాసంగి సీజన్‌లో వరి పంటకు బదులు .. ఆరుతడి పంటల సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కొన్నిరోజులుగా చెప్తున్నది. తక్కువ నీటితో ఎక్కువగా ఉత్పత్తయ్యే కందులు, శనగ, జొన్న, సజ్జ, పెసర, మినుము, కుసుమ, పొద్దు తిరుగుడు, నువ్వులు, వేరుశనగ వంటి పంటలను ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ భావిస్తున్నది. పప్పు ధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, వరిగడ్డి విత్తనాలను కూడా అందించాలని నిర్ణయం తీసుకున్నది. అందుకు రైతులను ఆరుతడి పంటల వైపు మళ్లించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని కూడా ప్రభుత్వం  సూచించింది. ఈ పంటలన్నింటికీ సంబంధించిన వివిధ రకాల  విత్తనాలను రైతులకు 50 నుంచి 75 శాతం వరకు రాయితీపై సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. యాసంగి సీజన్ ప్రారంభమైనా ఇంకా సబ్సిడీపై విత్తనాలు ఇవ్వకపోవడం ఏమిటని రైతులు అంటున్నారు. చెప్పడంతోనే సరిపెడితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. 

విత్తన రాయితీ, ఉద్యాన పంటల విస్తరణకు 520.88 కోట్లు 

రైతులకు అందించే విత్తనాల సబ్సిడీ, ఉద్యాన పంటల సాగు ప్రోత్సాహం కోసం రూ. 520.88 కోట్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని అధికారులు చెప్తున్నారు. వీటిలో విత్తనాల రాయితీ కోసం రూ.224 కోట్లు, ఉద్యాన పంటల ప్రోత్సాహం, విస్తరణ కోసం రూ.296.88 కోట్లు అవసరమని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. రైతు మేళాలు, గ్రామసభల ద్వారా అవగాహన కల్పించడంతోపాటు మల్చింగ్, వ్యవసాయ కుంటలు, వర్షపు నీటి సంరక్షణపై దృష్టి సారించాలని సూచించింది.

అయితే, విత్తనాల పంపిణీలో మాత్రం ఆలస్యం జరుగుతున్నదని రైతుల నుంచి విమర్శలు వస్తున్నాయి. వర్షాకాలంలోనే తగిన సమయానికి వర్షాలు కురవకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో విత్తనాలు ఆలస్యంగా విత్తాల్సి వచ్చిందని, ఇప్పుడు నేలలో తేమ శాతం తగ్గడంతో మొక్కల పెరుగుదల మందగించి దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. సబ్సిడీ విత్తనాలను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

స్థానిక వాతావరణం, నీటి లభ్యత, నేల స్వభావాన్ని బట్టి పంటల ఎంపికపైన రైతులకు మార్గనిర్దేశం చేయాలని రైతు సంఘం నాయకులు అంటున్నారు. అయితే.. రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం భారీగా ఉండటంతో పంటల మార్పిడి ప్రభుత్వానికి సవాల్‌గానే మారింది. 2025 యాసంగిలో ఏకంగా 59.90 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఇప్పుడు వర్షాభావ పరిస్థితుల  నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించడంతోపాటు విత్తనాలు, రాయితీలు, మార్కెటింగ్ సదుపాయాలు అందుబాటులోకి తెస్తేనే పంటల మార్పిడి లక్ష్యం నెరవేరే అవకాశం ఉందని రైతు సంఘాలు చెప్తున్నాయి.  

మరిన్ని వార్తలు