తిరుమల తరహాలో శబరిమల అభివృద్ధి

17-11-2026 | 02:04pm

శబరిమల: అయ్యప్ప స్వామి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కేరళ ప్రభుత్వం కీలక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తిరుమల తిరుపతి తరహాలో శబరిమలను (Sabarimala) ఆధునిక తీర్థయాత్ర కేంద్రంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. భక్తులకు మెరుగైన వసతి, రవాణా, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.

ఈ విషయాన్ని కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ వెల్లడించారు. కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో అయ్యప్ప భక్తుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక యాత్రికుల కేంద్రాన్ని (Pilgrim Facilitation Centre) నవంబర్ 17న ఆయన ప్రారంభించారు. తిరుమల తరహాలో శబరిమలలోనూ దీర్ఘకాలిక ప్రాతిపదికన మెరుగైన సౌకర్యాలు అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. 

అయ్యప్ప భక్తుల కోసం కొచ్చి విమానాశ్రయంలో 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇది 24 గంటల పాటు అందుబాటులో ఉంటుంది. ఇక్కడ దేవస్థానం సహాయ కేంద్రం, ప్రసాదం కూపన్ల కౌంటర్, ప్రీపెయిడ్ ట్యాక్సీ బుకింగ్, శాఖాహార భోజనశాల, విశ్రాంతి గది, విమానాల రాకపోకల వివరాలు తెలుసుకునే డిస్‌ప్లే ఏర్పాటు చేశారు.

దీంతో పాటు కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) బస్సుల బుకింగ్, ప్రత్యేక బస్సుల ఏర్పాటు, హెలికాప్టర్ ప్రయాణ బుకింగ్ (Helicopter Booking) సదుపాయాలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.

మరిన్ని వార్తలు