మూడేళ్లుగా సర్కారీ బడికి తాళం!

21-11-2026 | 05:05am
  1. నిద్రమత్తులో సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ
  2. 36 నెలలుగా రుక్మాపూర్ పాఠశాల బంద్.. 
  3. పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

జహీరాబాద్, నవంబరు 20: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామని, ప్రతి పేద విద్యార్థికి ఉచిత నాణ్యమైన విద్యను అందిస్తున్నామని పాలకులు, అధికారులు చేస్తున్న ప్రకటనలు సంగారెడ్డి జిల్లా(Sangareddy District) జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలం రుక్మాపూర్ గ్రామంలో నీటి మూటలుగానే మిగిలిపోయాయి. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (1 నుండి 5వ తరగతి) గత మూడు సంవత్సరాలుగా పూర్తిగా మూతపడి ఉన్నా విద్యాశాఖ అధికారులలో కనీస చలనం లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం..

సాధారణంగా ఏదైనా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గితే, విద్యాశాఖ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని ’బడిబాట’ వంటి కార్యక్రమాల ద్వారా తల్లిదండ్రులకు అవగాహన కల్పించి తిరిగి విద్యార్థులను చేర్చుకోవాలి. కానీ రుక్మాపూర్ పాఠశాల విషయంలో విద్యాశాఖ పూర్తిగా చేతులెత్తేసింది. మూడేళ్లుగా పాఠశాల తలుపులు తెరుచుకోకపోయినా, భవనం నిరుపయోగంగా మారినా కనీసం పర్యవేక్షించే నాథుడే కరువయ్యాడు. కొత్తగా ఉపాధ్యాయుడిని నియమించి, గ్రామంలో ప్రచారం చేసి తిరిగి బడిని ప్రారంభించాల్సిన అధికారులు, ఆ బాధ్యతను విస్మరించి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

మద్యం మత్తులో నాటి టీచర్.. నేటి దుస్థితికి కారణం

మూడేళ్ల క్రితం ఈ పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయుడు ప్రతినిత్యం మద్యం సేవించి విధులకు హాజరయ్యేవాడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే దారితప్పడంతో, తమ పిల్లల భవిష్యత్తు నాశనమవుతుందని గ్రహించిన గ్రామస్తులు అప్పట్లో విద్యాశాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేయడమే కాకుండా ధర్నా కూడా చేపట్టారు.

అయినప్పటికీ ఆ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవడంలో, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. అధికారుల ఉదాసీనతతో విసిగిపోయిన తల్లిదండ్రులు గత్యంతరం లేక తమ పిల్లలను ఆ బడి నుండి మాన్పించారు.

రెజింతల్కు టీచర్.. పేదలపై రూ. 30 వేల భారం

పాఠశాలను తిరిగి గాడిలో పెట్టాల్సిన విద్యాశాఖ, ఇక్కడ నియమించబడిన ఉపాధ్యాయుడిని ఎంపీపీఎస్ రెజింతల్ పాఠశాలకు డిప్యుటేష్ప పంపించి చేతులు దులుపుకుంది. ఊళ్లో బడి మూతపడటంతో 1 నుండి 5వ తరగతి చదివే చిన్నారులు ప్రతిరోజూ వ్యయప్రయాసలకోర్చి రాయికోడ్, న్యాల్కల్, జహీరాబాద్ పట్టణాల్లోని ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లాల్సి వస్తోంది. దీనివల్ల రవాణా ఖర్చులు, ప్రైవేట్ స్కూల్ ఫీజుల రూపంలో ఒక్కో విద్యార్థిపై ఏటా సుమారు రూ. 30 వేల వరకు భారం పడుతోందని పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఉపాధ్యాయుడి తప్పుకు గ్రామాన్ని, పేద విద్యార్థులను శిక్షించడం ఎంతవరకు సమంజసమని రుక్మాపూర్ వాసులు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి మూడేళ్లుగా మూతపడి ఉన్న పాఠశాలను తెరిపించాలని, పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులను నియమించి తిరిగి అడ్మిషన్లు ప్రారంభించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

విద్యాశాఖ నిర్లక్ష్యంతోనే...

రుక్మాపూర్ బడి మూతపడి మూడు సంవత్సరాల అవుతుంది. పాఠశాలను మళ్లీ తెరిపించేందుకు తమ వంతు కృషి చేస్తాను. గతంలో పనిచేసిన ఉపాధ్యాయుని నిర్వాహకం వల్లే పాఠశాల మూతపడింది. చదువు సక్రమంగా చెప్పకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపించడం వల్ల తమ పాఠశాల మూత పడింది. తిరిగి పాఠశాల తెరుచుకోవడానికి కృషి చేస్తా.

 సురేష్, సర్పంచ్ 

గతంలో జరిగిన తప్పిదమే..

మూడేళ్లుగా బడి బంద్ కావడంపై మండల విద్యాధికారి (ఎంఈఓ) మారుతీ రాథోడ్ను వివరణ కోరగా.. గతంలో పనిచేసిన ఉపాధ్యాయుడి నిర్వాకం వల్లే పాఠశాల మూతపడిందని అంగీకరించారు. ప్రస్తుతం గ్రామంలోని విద్యార్థులందరూ ఇతర ప్రాంతాలకు వెళ్లి చదువుకుంటున్నారని, అందుకే ఈ పాఠశాలకు కేటాయించిన ఉపాధ్యాయుడు రెజింతల్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు.

 మారుతి రాథోడ్, ఎంఈవో

మరిన్ని వార్తలు