డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 30 మందికి జైలు శిక్ష
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: సీపీ రష్మీ పెరుమాళ్
గజ్వేల్, నవంబర్ 11: మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై పోలీసులు నమోదు చేసిన కేసుల్లో 30 మందికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. గజ్వేల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రైవింగ్ లైసెన్స్ లేని కేసులకు సంబంధించి బుధవారం గజ్వేల్ ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు(Judicial First Class Magistrate Court)లో మొత్తం 35 కేసులు పరిష్కారమయ్యాయి.
వీటిలో 34 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కాగా, నాలుగు కేసుల్లో నిందితులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.40 వేల జరిమానా విధించారు. మిగిలిన 30 కేసుల్లో నిందితులకు ఒక రోజు నుంచి ఐదు రోజుల వరకు జైలు శిక్ష విధించారు. ఇందులో ఒక రోజు శిక్ష ఎనిమిది మందికి, రెండు రోజుల శిక్ష ఏడుగురికి, మూడు రోజుల శిక్ష నలుగురికి, నాలుగు రోజుల శిక్ష ఏడుగురికి, ఐదు రోజుల శిక్ష నలుగురికి పడింది. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన ఒకరికి రూ.5 వేల జరిమానా విధించారు. మొత్తం రూ.45 వేల జరిమానా విధించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ఐపీఎస్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనం నడపడం నేరమే కాకుండా సొంత ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదకరమని హెచ్చరించారు. రాంగ్ రూట్లో ప్రయాణించడం, ట్రిపుల్ రైడింగ్, అతివేగం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలని పేర్కొన్నారు. సురక్షితంగా గమ్యస్థానాలకు చేరడమే లక్ష్యంగా వాహనాలు నడపాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీపీ రష్మీ పెరుమాళ్ సూచించారు.