ప్రకృతి వ్యవసాయంతో నేలకు రక్షణ

28-10-2026 | 08:57pm

హుస్నాబాద్ ఏఓ పూజ 

కోహెడ,(విజయక్రాంతి): ప్రకృతి వ్యవసాయ పద్ధతులను(Natural farming methods) అవలంబించడం ద్వారా సాగు ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని హుస్నాబాద్ వ్యవసాయ శాఖ అధికారి వేల్పుల పూజ(Husnabad AO Velpula Pooja) అన్నారు. బుధవారం బంజేరుపల్లి గ్రామంలో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు. జీవామృతం, ఘన జీవామృతం, బీజామృతం, వేప ఆధారిత కషాయాల వినియోగం, పశువుల ఎరువు, పంట అవశేషాలు, పచ్చిరొట్ట ఎరువులు, అంతర పంటలు, పంట మార్పిడి వంటి పద్ధతుల ద్వారా నేలలో సేంద్రియ పదార్థాన్ని పెంచుకోవచ్చని రైతులకు వివరించారు.

రసాయన ఎరువులు, పురుగుమందులపై ఆధారపడటాన్ని తగ్గించి స్థానికంగా లభించే సహజ వనరులను వినియోగించుకోవాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయంతో నేలలో సూక్ష్మజీవుల చైతన్యం, తేమ నిలుపుకొనే సామర్థ్యం పెరుగుతాయని తెలిపారు. రైతులు తొలుత తమ పొలాల్లో కొంత విస్తీర్ణంలో ఈ పద్ధతులను అమలు చేసి, అనుభవం ఆధారంగా విస్తరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి విజయ్‌, ఎన్‌ఎంఎన్‌ఎఫ్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ప్రశాంత్‌, రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు