మార్కెట్ బయటే వ్యాపారం!?

14-10-2026 | 05:10am
  1. ఫీజు వసూళ్లలో వ్యాపారులతో సిబ్బంది లాలూచి ఆరోపణలు
  2. రైస్ మిల్లుల వద్ద మార్కెట్ ఫీజు వసూళ్లలో నిర్లక్ష్యం
  3. వంటిమామిడి కూరగాయల మార్కెట్ ఆదాయానికి గండి

గజ్వేల్, అక్టోబర్ 13: కోట్లాది రూపాయల కూరగాయల వ్యాపారం(Vegetable business) జరిగే వంటిమామిడి కూరగాయల మార్కెట్(Vegetable market) కు రావాల్సిన ఆదాయం పక్కదారులు పడుతుంది. గత 2021లో  మాజీ సీఎం కేసీఆర్(KCR) పరిశీలించిన తర్వాత ఆయన చేసిన సూచనల మేరకు ఆదాయం క్రమక్రమంగా పెరిగింది. అయితే గత సంవత్సరం మార్కెట్ ఆదాయం లక్షల్లోకి పడిపోయింది.

మార్కెట్లో ఉదయం జరిగే రైతు మార్కెట్తోనే వ్యాపారులు లావాదేవీలు ఎక్కువగా చేసి అవి లెక్కల్లో చూపకపోవడంతో భారీ స్థాయిలో ఆదాయం తగ్గిపోయింది. వివిధ దుకాణాల నుంచి వసూలు చేయాల్సిన మార్కెట్ ఫీజు(Market fee) సైతం వసూలు చేయడం లేదు. సిబ్బంది కొరత, నిధుల కొరత ఉండడంతో మార్కెట్ నిర్వహణ సరిగా లేకపోవడంతో పాలకవర్గం కూడా సరైన సేవలు అందించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

వంటిమామిడిలో బోయిన్ పల్లి వ్యాపారులు

వంటిమామిడి మార్కెట్లో స్థానికంగా వ్యాపారాలు చేసే వారితోపాటు బోయినపల్లికి చెందిన వ్యాపారులు కూడా  లైసెన్సులు పొందారు. కానీ వారు ఇక్కడ వ్యాపారాలు చేసిన దాఖలాలు కనబడవు. వారి నుంచి మార్కెట్ ఫీజు కూడా సరైన స్థాయిలో రాకపోవడం గమనార్హం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు  రైతు మార్కెట్లో ఎక్కువగా వ్యాపారాలు చేసేసరికి స్థానిక వ్యాపారులకు కూడా వ్యాపారం లేకుండా పోతుంది. కొందరు వ్యాపారులు మార్కెట్ ఫీజు ఎగ్గొట్టే దారులు వెతుకుతుండగా, నిజాయితీగా వ్యాపారాలు చేసే వారికి వ్యాపారం కరువైంది. 

 మార్కెట్ బయటే భారీగా వ్యాపారం

 పేరుకు కూరగాయల మార్కెట్ కమిటీ కానీ వ్యాపారాలు బయటే ఎక్కువ జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మార్కెట్ కమిటీ లెక్కల ప్రకారం 33 కూరగాయల హోల్ సేల్ దుకాణాలు, రైస్ మిల్లుల నుండి వసూలు చేయాల్సిన మార్కెట్ ఫీజు పూర్తిస్థాయిలో వసూలు చేయడం లేదు. అంతేకాకుండా మార్కెట్ కమిటీ లెక్కలోకి రాని దుకాణాలు సుమారు 70 వరకు కూరగాయల దుకాణాలు  ప్రతిరోజు లక్షల రూపాయల వ్యాపారం చేస్తున్నాయి. వారు మార్కెట్కు ఫీజులు మాత్రం సంవత్సర తరబడిగా చెల్లించడం లేదు.

వారిపై మార్కెట్ కమిటీ కూడా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. మార్కెట్ సిబ్బందికి ఆయా దుకాణాల నుండి నెలనెలా వేల రూపాయల మామూలుగా వెళుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ లెక్కన కోట్లాది రూపాయల వ్యాపారాలు మార్కెట్ కమిటీ పరిధి దాటే జరుగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దుకాణాల నుండి మామూలు ఎవరు వసూలు చేస్తున్నారు. ఆయా దుకాణాలు మార్కెట్ పరిధిలోకి ఎందుకు రావడం లేదు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు