భారత్, ఖతార్ మధ్య గట్టిపోటీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులు
రేసులో మరో 5 దేశాలు
లాసన్నే, అక్టోబర్ 6 : ఒలింపిక్స్(Olympics) ఆతిథ్య నిర్వహణ కోసం ప్రయత్నిస్తున్న భారత్‌కు ఖతార్(Qatar to India) నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది. 2036 ఒలింపిక్స్ బిడ్డింగ్ రేసులో భారత్, ఖతార్ ఫేవరెట్‌గా ఉన్నట్టు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(International Olympic Committee)(ఐవోసీ) స్పష్టం చేసింది. అయితే ఈ రెండు దేశాలతో పాటు మరో ఐదు దేశాలు ఆతిథ్య హక్కుల కోసం పోటీ లో ఉన్నట్టు తెలిపింది. దక్షిణాఫ్రికా, జర్మనీ, హంగరీ, దక్షిణ కొరియాతో పాటు తుర్కియే దేశాలు 2036 మాత్రమే కాకుండా 2040, 2044 ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం చర్చలు జరుపుతున్నట్టు వెల్లడించింది.
ఈ సందర్భంగా ఐవోసీ అధ్యక్షురాలు కిర్‌స్టీ కోవెంట్రీ కొన్ని కీలక తేదీలు వెల్లడించారు.2036 ఆతిథ్య హక్కుల కోసం బిడ్డింగ్ వేసేందుకు అక్టోబర్ 31 చివరి తేదీ. అలాగే నవంబర్‌లో ఫ్యూచర్ హోస్ట్ కమిషన్ ముందు వర్చువల్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం ఎగ్జిక్యూటివ్ బోర్డు వరిశీలన జరిపి అనువైన దేశాలతో తుది చర్చలు జరుపుతుంది.
2029 ఏడాది మధ్యలో ఓటింగ్ ద్వారా 2036 ఒలింపిక్స్ వేదికను అధికారికంగా ఖరారు చేస్తారు. భారత్ తరపున ఒలింపిక్స్ నిర్వహించేందుకు గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరాన్ని ప్రధాన వేదికగా ఎంపిక చేశారు. అహ్మదాబాద్‌లోనే భారత్ 2030 కామన్‌వెల్త్‌గేమ్స్‌కు ఆతిథ్యం ఇవ్వబోతోంది. కాగా గతంలో ఖతార్ 2022 ఫిఫా ప్రపంచకప్‌తో పాటు పలు పెద్ద క్రీడా ఈవెంట్లకు ఆతిథ్యమిచ్చింది. అటు సియోల్, జర్మనీ కూడా రేసులో ఉన్నాయి.