వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు సింధు
- ఐదేళ్ల తర్వాత క్వాలిఫై
- డిసెంబర్ 9 నుంచి 13 వరకు టోర్నీ
న్యూఢిల్లీ, నవంబర్ 4 : భారత స్టార్ షట్లర్ పీవీ సింధు(Indian star shuttler PV Sindhu) తన సూపర్ ఫామ్ కొనసాగిస్తోంది.ఈ ఏడాది ఇప్పటికే జపాన్ ఓపెన్ , హైలో ఓపెన్ టైటిల్స్ గెలిచిన ఆమె తాజాగా బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు(BWF World Tour Finals) అర్హత సాధించింది. సింధు ఐదేళ్ల తర్వాత ఈ మెగాటోర్నీకి క్వాలిఫై అయింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన సింధు(Sindhu) తాజా ప్రపంచ ర్యాంకింగ్స్‌లోనూ ఆరో స్థానానికి దూసుకొచ్చింది.ఇదిలా ఉంటే సింధు 2018లో తొలిసారి బీడబ్ల్యూఎఫ్ వరల్ టూర్ ఫైనల్స్ టైటిల్ గెలుచుకుంది.
ఆతర్వాత 2019, 2020లో గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. తిరిగి 2021లో ఫైనల్‌కు చేరినా అన్ సె యంగ్ చేతిలో ఓడిపోయింది. 2022లో కూడా సింధు బీడబ్ల్యూఎఫ్ వరల్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధించినప్పటికీ, గాయం కారణంగా చివరి నిమిషంలో తప్పుకుంది. దీంతో 2021 తర్వాత మళ్లీ ఈ టోర్నీలో ఆడే అవకాశం దక్కింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ చైనాలోని హాంగ్ జౌ వేదికగా డిసెంబర్ 9 నుంచి 13 వరకు జరుగనుంది.