ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా గిల్

14-10-2026 | 05:15am
  1. ఐదోసారి అవార్డు కైవసం
  2. మహిళల విభాగంలో షెఫాలీకి అవార్డు

దుబాయి, అక్టోబర్ 13 : ఐసీసీ ప్లేయర్ ఆఫ్ మంత్‌గా(ICC Player of the Month) సెప్టెంబర్ నెలకు సంబంధించి భారత జట్టు కెప్టెన్ శుభమన్ గిల్(Indian team captain Shubman Gill) విజేతగా నిలిచాడు. వెస్టిండీస్‌పై సూపర్ ఫామ్‌తో చెలరేగిన గిల్ ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికవడం గిల్‌కు ఇది ఐదోసారి. విండీస్‌తో వన్డే సిరీస్‌లో గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌లతో చెలరేగిపోయాడు. తొలి వన్డేలో 110, రెండో వన్డేలో 223 పరుగులతో అదరగొట్టాడు. ఛేజింగ్‌లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. గిల్ విధ్వంకర ఇన్నింగ్స్ కారణంగానే 406 పరుగుల లక్ష్యాన్ని భారత్ అలవోకగా ఛేదించింది.

కాగా 2023లో జనవరి, సెప్టెంబర్, 2025లో ఫిబ్రవరి ,జూలై నెలల్లో గిల్ ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. దీంతో ఐదుసార్లు ఈ అవార్డు అందుకున్న ఆటగాడిగా రికార్డులకెక్కాడు. మరోవైపు మహిళల విభాగంలో ప్లేయర్ ఆఫ్ ది మంత్ పురస్కారం షెఫాలీ వర్మను వరించింది. ఆసియాకప్‌లో భారత్ విజయాల్లో షెఫాలీ కీలకపాత్ర పోషించింది. 360 పరుగులు చేసిన షెఫాలీ బంతితోనూ రాణించి 6 వికెట్లు తీసింది. ఆసియా క్రీడల్లోనూ బంగ్లాదేశ్‌పై సెమీస్‌లో సెంచరీ కొట్టింది. గత ఏడాది నవంబరులో వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆడిన ఇన్నింగ్స్‌కు గానూ తొలిసారి షెఫాలీకి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు దక్కింది.

మరిన్ని వార్తలు