బైక్ ను ఢీకొట్టిన లారీ
* భర్త మృతి... చావు బతుకుల మధ్య భార్య పోరాటం
* మద్యం మత్తులో లారీ డ్రైవర్
గరిడేపల్లి నవంబర్ 15, (విజయక్రాంతి): మద్యం మత్తులో లారీ నడిపిన డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ కుటుంబం రోడ్డున పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా(Suryapet District) హుజూర్ నగర్ పట్టణం పీర్ల కొట్టం బజార్ కి చెందిన షేక్ నజీర్, భార్య హుస్సేన్ బీ దంపతులిరువురు వంటమాస్టర్లూ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
ఆదివారం దామరచర్ల మండలం కల్లేపల్లిలో ఓ కార్యక్రమంలో వంట చేసేందుకు వెళ్లి వస్తూ గరిడేపల్లి మండలం అప్పన్నపేట గ్రామ సమీపంలో చేరుకునేసరికి హుజూర్ నగర్ నుంచి గరిడేపల్లి వైపు సిమెంట్ లోడ్ తో వస్తున్న లారీ డ్రైవర్ మద్యం మత్తులో బైక్ ను ఢీకొట్టడంతో నజీర్ అక్కడికక్కడే మృతి చెందగా ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారం అందించి హుస్సేన్ బి ని హుజూర్నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపినట్లు సమాచారం. సమాచారం అందుకున్న గరిడేపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. భార్యాభర్తలు ఇరువురు వంట మాస్టారుగా పనిచేస్తూ జీవనం కొనసాగించే వంట మాస్టర్ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది