రోడ్డుపై మృత్యు గొయ్యి.!
- - పగిలిన గూనలు..రహదారిపై భారీ గుంట
- - 15 రోజులుగా పట్టించుకోని అధికారులు
- - ప్రమాదం అంచున బీసీ హాస్టల్ విద్యార్థులు, వాహనదారులు
- - రాత్రివేళల్లో పొంచి ఉన్న ముప్పు
- - కోదాడ 21వ వార్డులో అధ్వానంగా మారిన రహదారి
కోదాడ నవంబర్ 15 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా(Suryapet District) కోదాడ పట్టణంలోని 21వ వార్డులో రోడ్డు ప్రమాదకరంగా మారింది. ఎర్రకుంట చెరువుకు వెళ్లే కాలువ సమీపంలోని బీసీ హాస్టల్ రోడ్డుపై గూనలు పగిలి భారీ గుంట ఏర్పడింది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించడం ఇబ్బందికరంగా మారింది. ఈ సమస్య ఏర్పడి 15 రోజులు గడుస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారి మీదుగా బీసీ హాస్టల్ విద్యార్థులు, ద్విచక్ర వాహనదారులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు.
గూనలు పగిలి ఏర్పడిన భారీ గుంటతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో గుంట కనిపించక వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలించి పగిలిన గూనలను మరమ్మతు చేయడంతో పాటు గుంటను పూడ్చి రహదారిని బాగుచేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించకుండా ముందుగానే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.