కోడిగుడ్డు పౌష్టికరమైన ఆహారం

03-11-2026 | 10:58pm

రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర 

వరంగల్, (విజయక్రాంతి): కోడిగుడ్డు పౌష్టికరమైన ఆహారమని, కోడిగుడ్ల ద్వారా మన శరీరానికి అవసరమైన నాణ్యమైన ప్రోటీన్లు, విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర(MP Vaddiraju Ravichandra) అన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆయన సోదరుడు నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ వరంగల్ జోనల్ ఛైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావుల ఆధ్వర్యాన వారి స్వగ్రామం పర్వతగిరిలో మంగళవారం మధ్యాహ్నం 30 మంది చిరు వ్యాపారులకు ఎగ్ కార్డులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి ఎంపీ రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, పిల్లల ఎదుగుదలకు, కండరాల పుష్టికి,శరీరానికి అవసరమైన శక్తి కోడిగుడ్ల ద్వారా లభిస్తుందని వివరించారు. తక్కువ ధరలో అధిక పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించే కోడిగుడ్లను ప్రతి ఒక్కరూ తమ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించారు. ప్రజల ఆరోగ్యం, పౌష్టికాహారం పట్ల అవగాహన కల్పిస్తూ లబ్ధిదారులకు ఉపయోగపడే విధంగా ఎగ్ కార్డుల పంపిణీ చేపట్టిన దయాకర్ రావు, ప్రదీప్ రావు,వారి కుటుంబ సభ్యులను ఎంపీ వద్దిరాజు అభినందించారు. ఈ సందర్భంగా వ్యాపారులకు స్టాల్, సిలిండర్, మూకుడు, గంటెలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు,కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు