తోపుగాని చెరువు నాలా కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి

07-11-2026 | 10:43pm

న్యూ గుండ్లపల్లి చెరువు నాలాను పరిరక్షించాలి

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): యాదగిరిగుట్ట మున్సిపాలిటీ(Yadagirigutta Municipality) పరిధిలోని న్యూ గుండ్లపల్లిలో ఉన్న తోపుగాని చెరువు నాలాను ఆక్రమిస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (Communist Party of India) డిమాండ్ చేసింది. తోపుగాని చెరువు నాలాను సిపిఐ బృందం శనివారం  పరిశీలించింది. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పెరబోయిన మహేందర్(CPI District Executive Committee Member Peraboyina Mahender), సిపిఐ మండల కార్యదర్శి కల్లేపల్లి మహేందర్  మాట్లాడుతూ... ప్రజా అవసరాల కోసం ఉన్న చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం ఆక్రమణలకు గురికావడం ఆందోళనకరమని అన్నారు.

తోపుగాని చెరువు నాలా ఆక్రమణలకు గురైతే వర్షపు నీటి ప్రవాహానికి తీవ్ర ఆటంకం ఏర్పడి భవిష్యత్తులో న్యూ గుండ్లపల్లి రైతులు,ప్రజలు తాగు సాగునీరుకు   ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. చెరువులు, నాలాలు ప్రకృతి సంపద అని, వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉందని స్పష్టం చేశారు. సంబంధిత అధికారులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించాలని కోరారు.

జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి తోపుగాని చెరువు నాలా హద్దులను గుర్తించాలని, ఆక్రమణలు జరిగినట్లు నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆక్రమణలను తొలగించి నాలా భూమిని ప్రభుత్వ ఆధీనంలో పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంగం జిల్లా ఉపాధ్యక్షులు పెరబోయిన బంగారు, గోపగని రాజు పాల్గొన్నారు .

మరిన్ని వార్తలు