వైభవంగా కార్తీకోత్సవంను నిర్వహించేందుకు ఏర్పాట్లు
యాదాద్రి కార్తీకోత్సవం–2026 పోస్టర్లు ఆవిష్కరించిన మంత్రి కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి
యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): యాదగిరిగుట్ట దేవస్థానం(Yadagirigutta Temple)లో కార్తీకోత్సవము(Karthikotsavam)ను వైభవంగా నిర్వహించే నిర్వహించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. అందులో భాగంగా కార్తీకోత్సవం–2026(Yadadri Karthikotsavam–2026)కు సంబంధించిన పోస్టర్లు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీ అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య ఆవిష్కరించారు.
కార్తీక మాస పవిత్రత, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చాటడంతో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కళా వారసత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి(Sri Lakshmi Narasimha Swamy of Yadagirigutta) వారి దివ్యక్షేత్రంలో ఈ నెల 20వ తేదీ నుండి 22వ తేదీ వరకు మూడు రోజుల పాటు కార్తీకోత్సవం–2026 కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా వివిధ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రాష్ట్ర సుభిక్షం కోసం శ్రీ లక్ష్మీనరసింహస్వామి నామార్చన సహిత కోటి పుష్పార్చన
ఎల్నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో వర్షపాతం తగ్గి కరువు పరిస్థితులు ఏర్పడకుండా, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా, సుభిక్షంగా ఉండాలని, రైతాంగం పాడిపంటలతో వర్ధిల్లాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, సిరిసంపదలతో జీవించాలని ఆకాంక్షిస్తూ కార్తీక మాసంలోని ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నవంబర్ 20వ తేదీ శుక్రవారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దివ్య సన్నిధిలో దేవస్థాన అర్చకులు, వేద పండితులచే స్వామివారి దివ్య నామస్మరణతో మొట్టమొదటిసారిగా అత్యంత వైభవంగా కోటి పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజల సంక్షేమం, ప్రకృతి అనుకూలత, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవడం, రైతాంగం సుభిక్షంగా ఉండటం, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం కోసం శ్రీ స్వామివారిని ప్రత్యేకంగా ప్రార్థించనున్నారు. ఈ సందర్భంగా కార్తీక మాసంలో నిర్వహించే ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా భక్తుల్లో భక్తిభావం, ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించడంతో పాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు మరింత ప్రాచుర్యం కల్పించనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. భక్తులు, ప్రజలు మూడు రోజుల పాటు నిర్వహించే కార్తీకోత్సవం–2026 కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని అధికారులు కోరారు.