ఆలేరులో దొంగతనాలు ఆగవా?
- బైకులు, బోరు మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లే టార్గెట్..
- మహిళల మెడల్లో పుస్తెలతాళ్లకూ భద్రత కరువు!
- వరుస చోరీలతో ప్రజలు, రైతుల్లో ఆందోళన..
- పోలీస్ స్టేషన్లో పెరుగుతున్న ఫిర్యాదులు!
- గస్తీ లేదంటూ ఆగ్రహం
- దొంగలను పట్టుకోవాలని బాధితుల వేడుకోలు..
ఆలేరు, అక్టోబర్ 14: ఆలేరు మండల(Aleru Mandal) పరిధిలో వరుసగా చోటుచేసుకుంటున్న దొంగతనాలు(Thefts) స్థానికుల్లో తీవ్ర భయాందోళనలను కలిగిస్తున్నాయని ప్రజలు ఆరోపి స్తున్నారు. ఇళ్ల ముందు నిలిపిన ద్విచక్ర వాహనాల నుంచి వ్యవసాయ బోరు మోటార్లు(Agricultural borewell motors), విద్యుత్ వైర్లు, ట్రాన్స్ఫార్మర్ల(Transformers)లోని విలువైన సామగ్రి వరకు అన్నీ దొంగలపాలు అవుతున్నాయని వాపోతున్నారు.
మరోవైపు బస్టాండ్లలో ప్రయాణికుల సెల్ఫోన్లు, మహిళల మెడల్లోని పుస్తెలతాళ్లు సైతం చోరీకి గురవుతున్న ఘటనలు తీవ్ర కలవరం సృష్టిస్తున్నాయి. ఈ వరుస చోరీలతో ఇబ్బందులు పడుతున్న తమకు రక్షణ ఎక్కడని, నేరాల నియంత్రణలో పోలీసుల నిఘా వైఫల్యం చెందిందని ప్రజలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇళ్ల ముందే మాయమవుతున్న ద్విచక్ర వాహనాలు
ఆలేరు మండలంలో ఇళ్ల ముందు నిలిపిన బైకులు కూడా సురక్షితంగా లేవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గొలనుకొండ గ్రామానికి చెందిన మారుపెళ్లి భాగ్యమ్మ భర్త సాయిలు తన ద్విచక్ర వాహనాన్ని(టీఎస్27 సీ 5002) సెప్టెంబర్ 25న ఇంటి ముందు నిలిపితే, గంటల వ్యవధిలోనే మాయమైందని బాధితులు వాపోతున్నారు.
సెప్టెంబర్ 26న పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎలాంటి ఆచూకీ లభించలేదని చెబుతున్నారు. అలాగే ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి జీడికల్ రోడ్డు మధ్యలో ఉంటున్న బండ్రు గణేష్ తన గ్లామర్ టీ ఎస్ 07 ఈఎక్స్ 565 నంబరు గల మెరూన్ రంగు ద్విచక్ర వాహనాన్ని అక్టోబర్ 8వ తేదీ అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారని ఆరోపిస్తున్నారు.
రైతుల మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లే టార్గెట్
వ్యవసాయానికి కీలకమైన బోరు మోటార్లు, పంపుసెట్లు, విద్యుత్ వైర్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు జరుగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ఆలేరుకొలనుపాక రహదారిలోని పర్రె మైసమ్మ గుడి పరిసరాల్లో సుమారు పది వ్యవసాయ మోటార్లకు సంబంధించిన వైర్లను కత్తిరించి రాగి తీగలను ఎత్తుకెళ్లినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఎలుగల మహేందర్, కర్రె శ్రీను, బోడపట్ల సిద్దులు తదితరుల వ్యవసాయ బావుల వద్ద విద్యుత్ వైర్లు చోరీకి గురయ్యాయని చెబుతున్నారు.
గత నాలుగు నెలలుగా ఈ తంతుసాగుతున్నా పట్టించుకునేవారు లేరని, ఇప్పటికే సాగు పెట్టుబడులతో నష్టపోతున్న తమకు ఈ చోరీలు మరింత ఆర్థిక భారాన్ని మిగులుస్తున్నాయని రైతులు వాపోతున్నారు. అలాగే విజయ పార్క్ సమీపంలో ట్రాన్స్ఫార్మర్ను కిందపడేసి విలువైన సామగ్రిని ఎత్తుకెళ్లిన ఘటనలపై సమగ్ర విచారణ జరపాలని కోరుతున్నారు.
మహిళల పుస్తెలతాళ్లు, బస్టాండ్ లలో సెల్ఫోన్ల చోరీ
మహిళల మెడల్లోని పుస్తెలతాళ్లను లాక్కెళ్లిన చైన్ స్నాచింగ్ ఘటనలు నాలుగైదు చోటుచేసుకున్నట్లు స్థానికుల నుంచి సమాచారం వినిపిస్తోంది. రద్దీ ప్రాంతాలు, బస్సులు ఎక్కే సమయాల్లో ప్రయాణికుల సెల్ఫోన్లు మాయమవుతున్నాయని పలువురు వాపోతున్నారు. రద్దీ ప్రదేశాలు, బస్టాండ్లలో నిఘా లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.
పోలీసుల గస్తీ ఎక్కడంటూ బాధితుల ఆగ్రహం
వరుస చోరీలు జరుగుతున్నా పోలీసుల రాత్రి గస్తీ, నిఘా వైఫల్యంపై ప్రజల నుంచి తీవ్ర ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయని, బైకులు, వ్యవసాయ సామగ్రి, సెల్ఫోన్లు మాయమవుతున్నా దర్యాప్తు పురోగతిపై స్పష్టత లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించి అనుమానితులపై నిఘా పెంచాలని, చోరీకి గురైన విలువైన వస్తువులను త్వరగా రికవరీ చేసి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
మా ఇంటి ముందు బైక్ మాయమైంది..
గత నెల 25న మా ఇంటి ముందు నిలిపిన ద్విచక్ర వాహనం కేవలం గంట వ్యవధిలోనే చోరీకి గురైంది. ఈ ఘటనపై మరుసటి రోజే పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి ఆచూకీ లభించలేదు.రానున్న రోజులల్లో ఇంకెన్ని దారుణలు చూడాలో ఏమో... కనీస భద్రత కరువైంది.
- మారుపెల్లి భాగ్యమ్మ