బేల మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి

09-11-2026 | 05:12pm

వచ్చే సోమవారం లోగా కొనుగోళ్లు చేపట్టకుంటే రైతులతో కలిసి భారీ ధర్నా

మాజీ మంత్రి జోగు రామన్న

బేల నవంబర్ 09(విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్(Central and state governments corporate) శక్తులకు అనుగుణంగా పాలన సాగిస్తూ రైతుల(Farmers') ప్రయోజనాలను విస్మరిస్తున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న(Jogu Ramanna) మండిపడ్డారు. సోమవారం బేల మండల(Bela Mandal) కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన బేల వ్యవసాయ మార్కెట్‌లో(Bela Agricultural Market) పత్తి కొనుగోళ్ల(Cotton purchases) పరిస్థితిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మార్కెట్ ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు సీసీఐతో పాటు ప్రైవేట్ వ్యాపారులు కూడా పత్తి కొనుగోళ్లు ప్రారంభించకపోవడం దారుణమన్నారు. రైతులు పండించిన పత్తిని విక్రయించుకునేందుకు ఎదురుచూస్తున్నా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. తక్షణమే సీసీఐ, ప్రైవేట్ కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. వచ్చే సోమవారం లోగా కొనుగోళ్లు ప్రారంభించకపోతే బేల మండల కేంద్రంలో రైతులతో కలిసి భారీ ఎత్తున ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఎకరానికి పది క్వింటాళ్ల పత్తి దిగుబడి రావాల్సి ఉండగా ప్రస్తుతం ఒకటి, రెండు క్వింటాళ్లు మాత్రమే వస్తుండటంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు తీసుకొచ్చి రైతులను ఆదుకుంటామని హామీలు ఇచ్చిన బీజేపీ ప్రజాప్రతినిధులు, నేటికీ కనీసం పంట నష్టపరిహారం అందించకపోవడం సిగ్గుచేటన్నారు.

స్థానిక బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు రైతుల సమస్యలపై దృష్టి సారించకపోవడం వారి చిత్తశుద్ధికి నిదర్శనమని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం విదేశీ దిగుమతులపై సుంకాలు ఎత్తివేయడం వల్ల దిగుమతులు పెరిగి దేశీయంగా పత్తి సాగు చేస్తున్న తెలంగాణ రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. మరోవైపు పత్తి ధరలు తగ్గేలా ప్రభుత్వ విధానాలు రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆరోపించారు.

ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం రైతుల సమస్యలపై చిత్తశుద్ధితో స్పందించి బేల మార్కెట్‌లో వెంటనే పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి రైతులకు అండగా నిలుస్తామని జోగు రామన్న స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో రౌతు మనోహర్, సతీష్ పవర్, దేవన్న, మస్కి తేజరావు, విప్పిన్, మంగేష్, దైవన్న, మురళి, ఎం.డి. అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు