ఒకే వేదికపై మెగా, అక్కినేని హీరోలు.. ఫ్యాన్స్‌కు పండగే
టాలీవుడ్లో మరో ఆసక్తికరమైన సినిమా వేడుకకు రంగం సిద్ధమైంది. కొత్త హీరో అనీష్ నటిస్తున్న 'ఇట్లు అర్జున' మూవీ(Ittu Arjun Movie) ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్‌లో భారీ మ్యూజికల్ కన్సర్ట్(Musical Concert) నిర్వహించనున్నారు. ఈ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కింగ్ నాగార్జున, అక్కినేని అఖిల్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. నవంబర్ 9న సాయంత్రం 5 గంటలకు హైటెక్స్ హాల్ నంబర్ 4లో ఈ కార్యక్రమం జరగనుంది.
తమన్ లైవ్ మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్
సంగీత దర్శకుడు ఎస్.తమన్(Music Director S.Thaman) ఈ వేడుకలో ప్రత్యేక సంగీత ప్రదర్శన ఇవ్వనున్నారు. సినిమాలో ఇప్పటికే విడుదలైన 'హాయ్ రే', 'చిన్ని చిన్ని', 'ఎల్లో చున్నీ' పాటలతో పాటు ఇతర సంగీత విభావరులు ప్రేక్షకులను అలరించనున్నాయి. సాధారణ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు భిన్నంగా పూర్తిస్థాయి మ్యూజికల్ కన్సర్ట్‌గా దీనిని రూపొందిస్తున్నారు.
నవంబర్ 13న థియేటర్లలోకి సినిమా
అనీష్ హీరోగా, అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంతో మహేష్ ఉప్పల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నాగార్జున ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
మాట్లాడలేని అర్జున్ అనే యువకుడి జీవితంలో చోటుచేసుకునే ప్రేమ, భావోద్వేగాలు, సంఘర్షణల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.