ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వెలుగులు
లబ్ధిదారులతో కలిసి పండుగ సంబరాలు
కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా మమేకమైన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
బాన్సువాడ, నవంబర్ 9 (విజయ క్రాంతి): ఇల్లు ప్రతి పేద కుటుంబం జీవితకాల స్వప్నం.. ఆ స్వప్నాన్ని సాకారం చేసిన ఇందిరమ్మ ఇళ్లలో(Indiramma house) దీపావళి వెలుగులు నింపుతూ, లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి పండుగ జరుపుకోవడం ప్రత్యేక ఆనందాన్ని కలిగించింధని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి(MLA Pocharam Srinivas Reddy) అన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొని పండుగ ఆనందాన్ని పంచుకున్నారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాలను స్వయంగా కలుసుకుని వారితో ఆత్మీయంగా ముచ్చటించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. .
ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు అనేది ఒక కల అని, ఇందిరమ్మ ఇళ్లతో ఆ కలను నిజం చేసుకునే అవకాశం లభించిందన్నారు. లబ్ధిదారుల సొంతింటిలో దీపావళి వెలుగులు చూడటం, వారితో కలిసి పండుగ జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
ఈ వేడుకల్లో మాజీ ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు, బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గోపి గంగాధర్, బాన్సువాడ, నస్రుల్లాబాద్, బీర్కూర్ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.