పేద కుటుంబాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

09-11-2026 | 06:04pm

123 మంది లబ్ధిదారులకు రూ.1.02 కోట్ల విలువైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నాం – ఎమ్మెల్యే జారె

దమ్మపేట, నవంబర్ 09(విజయక్రాంతి): సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవడమే కాంగ్రెస్ ప్రభుత్వ(Congress government) లక్ష్యమని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ(Ashwaraopeta MLA Jare Adinarayana) పేర్కొన్నారు. దమ్మపేట మండల కేంద్రం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 87 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల(Kalyana Lakshmi and Shaadi Mubarak schemes) ద్వారా రూ.87 లక్షల 10 వేల 92 విలువైన చెక్కులను, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 36 మంది లబ్ధిదారులకు రూ.15 లక్షల 60 వేల విలువైన చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాల చెక్కుల పంపిణీని ప్రభుత్వం నిలిపివేస్తుందని గతంలో ప్రతిపక్షాలు చేసిన ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి సంక్షేమ పథకాలన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు.

కల్యాణ లక్ష్మి పథకం క్రింద 87 మంది లబ్ధిదారులకు అందించిన చెక్కులే ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. మహిళల అభ్యున్నతికి, సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సబ్సిడీతో పాటు స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని వివరించారు.

గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఆర్థికంగా ఎదగడంతో పాటు డ్వాక్రా సంఘాల కార్యకలాపాలు మరింత బలోపేతం కావాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో డ్వాక్రా మహిళా సంఘాలకు కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తున్నామని చెప్పారు. నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపు 70 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను కూడా త్వరగా పూర్తి చేసి మహిళలకు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఇటీవల మురసు తుఫాన్ ప్రభావంతో అశ్వారావుపేట నియోజకవర్గంలో భారీగా నష్టం జరిగిందని  తెలిపారు.

వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రహదారులు, చెరువులు ఇతర మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విపత్తు సంభవించిన వెంటనే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేయడంతో పాటు రోడ్ల మరమ్మతులు, చెరువుల పునరుద్ధరణ పనులకు ప్రాధాన్యత ఇచ్చామని వివరించారు.

కేవలం రెండు రోజుల్లోనే నియోజకవర్గానికి అవసరమైన నిధులు కేటాయించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,  ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావులకు నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని  సూచించారు. సామాన్య కుటుంబాలకు కష్టకాలంలో ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రజల అవసరాలను గుర్తించి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.

మరిన్ని వార్తలు