గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం

21-11-2026 | 12:18pm

కేసముద్రం: మహబూబాబాద్ జిల్లాలో గుడుంబా తయారీ, విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కేసముద్రం మండలంలోని చెరువుముంతు తండా, బోడ మంచ్య తండాల్లో శనివారం తెల్లవారుజామున విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ (Cordon and Search) నిర్వహించారు. ఈ తనిఖీల్లో 4,000 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి, 50 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు.

మహబూబాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఉదయం 5:30 నుంచి 7:30 గంటల వరకు ఈ తనిఖీలు చేపట్టారు. కేసముద్రం, నెల్లికుదురు, ఇనుగుర్తి పోలీస్ స్టేషన్ల ఎస్సైలు, సర్కిల్ పోలీసు సిబ్బంది సంయుక్తంగా ఈ ఆపరేషన్ (Police Operation) నిర్వహించారు. అక్రమంగా నాటుసారా తయారీ, నిల్వ, రవాణా చేస్తున్న ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా 50 ద్విచక్ర వాహనాలను తనిఖీ చేసి వాటి రికార్డులు, ధ్రువపత్రాలను పరిశీలించారు. అనంతరం తండావాసులకు గంజాయి వినియోగం, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత (Cyber Crime Awareness), పోక్సో చట్టం, బాల్యవివాహాల నిరోధంపై పోలీసులు అవగాహన కల్పించారు.

చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమంగా నాటుసారా తయారు చేసినా, విక్రయించినా చట్టప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని కేసముద్రం సీఐ సత్యనారాయణ తెలిపారు.

మరిన్ని వార్తలు